సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో ఊరినిండా జాతీయ జెండాలు 

  • Published By: chvmurthy ,Published On : September 14, 2019 / 02:02 AM IST
సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో ఊరినిండా జాతీయ జెండాలు 

Updated On : September 14, 2019 / 2:02 AM IST

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిధ్దం చేసింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలను ఆకర్షించేలా బీజేపీ చర్యలు చేపట్టింది.  నిజాం పాలనకు వ్యతిరేకంగా ‘బండెనుక బండి కట్టి’పాటను రాసిన బండి యాదగిరి విగ్రహాన్ని తిరుమలగిరిలో  సెప్టెంబర్  9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. రజాకార్ల వ్యతిరేక పోరాటాలు జరిగిన, చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన స్థలాలను సందర్శిస్తోంది. స్ధానిక ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తోంది. రజాకార్లు 16 మందిని హత్య చేసిన మహబూబాబాద్‌ జిల్లాలోని దేవుని సంకీసలో సమావేశం నిర్వహించింది.

సెప్టెంబరు 14న నిజామాబాద్‌ జిల్లాలో విమోచన దినోత్సవ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 16న బైరాన్‌పల్లిలో పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అదే రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పంపల్లిలో, ఆసిఫాబాద్‌ జిల్లాలో, నిర్మల్‌ జిల్లా వేయి ఊరుల మర్రిలో, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలో కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. వాటిల్లో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొనేలా చర్యలు చేపట్టింది.

సెప్టెంబర్ 17 న  విమోచన దినోత్సవం
సెప్టెంబర్ 17న ఊరినిండా జెండాలు కార్యక్రమం పేరుతో  తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవాలు నిర్వహించాలని, అందులో భాగంగా ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామంలో జాతీయ జెండాలు ఆవిష్కరించాలని నిర్ణయించామని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి  చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాతో  బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు పటాన్‌చెరులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. సభకు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, కిషన్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా అధికారిక కార్యక్రమాల కారణంగా 17వ తేదీన రాలేకపోతున్నారని, ఆ తరువాత రాష్ట్ర పర్యటనకు వస్తారని వివరించారు.