గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు : సీఎం కేసీఆర్ భావోద్వేగం

తెలంగాణ ప్రభుత్వం.. నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు.. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు సెండాఫ్ ఇచ్చారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్ నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన నరసింహన్‌తో తనకు అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయన్నారు. రాజ్ భవన్‌లో గవర్నర్ దంపతులు ప్రతీ పండుగను గొప్ప వేడుకగా నిర్వహించేవారని, ఇప్పుడా నోరూరించే రుచులకు దూరం అవుతున్నామని చెప్పారు. ఆయన ఇచ్చిన స్పూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళతామని చెప్పారు. నరసింహన్‌కు ఇచ్చిన గౌరవం.. కొత్త గవర్నర్‌కు కూడా ఇస్తామన్నారు. ప్రసంగం మధ్యలో చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.
వీడ్కోలు సభలో నరసింహన్ కూడా ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాల్లో మానవత్వం ఉందన్నారు. నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లాంటి పథకాల్లో కేసీఆర్ విజనరీ కనిపించిందన్నారు. తెలంగాణలో శాంతిభధ్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉందన్న ఆయన..కేసీఆర్ స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి, స్క్రీన్ పై పథకాల గురించి వివరించిన వైనాన్ని తాను ప్రధాన మంత్రికి కూడా చెప్పానన్నారు. తాను ఎక్కడున్నా తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తానన్నారు. ప్రసంగంలో సంస్కృత శ్లోకాలు చదివారు. తన పేరు నరసింహన్ కాబట్టి అప్పుడప్పుడు నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.
అటు తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.