బెయిల్ కావాలంటే పుల్వామా అమరులకు ఒక్కొక్కరికి లక్ష ఇవ్వండి

తెలంగాణ హైకోర్టు మానవీయ కోణంలో ఆలోచించి సీఆర్పీఎఫ్ జవాన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. చీటింగ్ కేసులో కస్టడీలో ఉన్న సన్ పరివార్ గ్రూపు వ్యక్తికి బెయిల్ కావాలంటే ఒక్కొక్కరికి రూ.లక్ష డొనేట్ చేయమంటూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది సన్ పరివార్ గ్రూపు 14వేల మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.150 కోట్ల వరకూ వసూలు చేసి ఎగ్గొట్టింది.
బాధితులంతా కలిసి కోర్టుకెక్కగా సన్ పరివార్ గ్రూపు అధినేతను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి బెయిల్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ జరిగినప్పుడు అధికారులకు సహకరించాలి అనే షరతు మీద బెయిల్ మంజూరు చేసింది. కానీ, విచారణలో సరిగా సహకరించకపోవడంతో బెయిల్ క్యాన్సిల్ చేసేందుకు సిద్ధమైంది.
నిందితుడు లబోదిబోమంటూ బెయిల్ ఇప్పించమని కోర్టు మెట్లక్కగా చివరికి పుల్వామా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున విరాళమిస్తేనే బెయిల్ మంజూరు చేస్తామంటూ మానవీయ కోణంలో తీర్పును ప్రకటించింది. దాంతో పాటు ఇన్వెస్టిగేటర్స్‌కు సహకరించాలని తీర్పులో పేర్కొంది. ఫిబ్రవరి 14న పాక్ నిషేదిత గ్రూపు నిర్వహించిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.