టీడీపీ ఫేక్ సర్వేలు: కేసు పెట్టిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 02:39 AM IST
టీడీపీ ఫేక్ సర్వేలు: కేసు పెట్టిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌

Updated On : April 3, 2019 / 2:39 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం సర్వే నిర్వహించిందని, అందులో  టీడీపీకి 126, వైసీపీ 39, జనసేనకు 10 సీట్లు వస్తాయంటూ నకిలీ రిపోర్ట్ తయారు చేసి ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సర్వేలు చేయలేదని, తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం పేరుతో సర్వేలను తయారుచేసుకుని తప్పుడు ప్రచారం చేసుకునేందుకు తమ ప్రతిష్టకు దెబ్బతీస్తున్నారని హరిప్రసాద్ అన్నారు టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. వీరపనేని రామకృష్ణ నేతృత్వంలోని మ్యాంగో అండ్‌ వాక్డ్‌ అవుట్, అదుగాని మల్లేష్‌ నేతృత్వంలోని చాలెంజ్‌ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్‌నగర్‌ సంస్థలు ఈ ఫేక్ సర్వేలను ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు హరిప్రసాద్‌ తన ఫిర్యాదులో వెల్లడించారు. తన ఫిర్యాదుతో పాటు యూట్యూబ్‌ లింకులు, అందులో పొందుపర్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను హరిప్రసాద్ పోలీసులకు అందజేశారు.

వీటిని పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీలోని 171 (సీ), రెడ్‌విత్, 171 (ఎఫ్‌), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్‌విత్‌ 120(బీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్‌ 66(డీ) కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అంతకుముందు కూడా లోక్‌నీతి-సీఎస్డీఎస్ సర్వే పేరుతో తప్పుడు సర్వే వచ్చిందంటూ వైసీపీ నేతలు పోలీసులరకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.