9 లక్షలు కట్టండి : జానా..షబ్బీర్‌లకు ఇంటెలిజెన్స్ నోటీసులు

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో బుల్లెట్ ఫ్రూప్ వాహనం వాడుకున్నారు..అద్దె..డ్రైవర్ జీతం ఎవరిస్తారు ? మీరే ఇవ్వాలంటూ
కాంగ్రెస్ పెద్ద తలకాయలు జానారెడ్డి…షబ్బీర్ ఆలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు జారీ చేసింది. 2007 సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం వాహనాలు సమకూర్చుకున్న వారు అద్దె..డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని జనవరి 05వ తేదీ ఇంటెలిజెన్స్ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.
బుల్లెట్ వాహనాల వినియోగం…
ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో షబ్బీర్..జానారెడ్డిలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నారు. సెప్టెంబర్ 6 నుండి డిసెంబర్ 7 వరకు టీఎస్ 09పీ 1653, టీఎస్ 09 పీఏ 1654 వాహనాలను ఉపయోగించినట్లు నోటీసుల్లో తెలిపారు. షబ్బీర్ ఆలీ 12,728 కి.మీటర్లు ప్రయాణిస్తే..జానారెడ్డి 11, 152 కి.మీటర్లు ప్రయాణించారని వెల్లడించారు. ఇందుకు గాను ప్రతి కిలో మీటర్‌కు రూ. 37లతో పాటు డ్రైవర్ భత్యం రోజు వారి రూ. 100లతో కలిపి మొత్తం రూ. 4, 79, 936 షబ్బీర్ చెల్లించాలని తెలిపారు. ఇక జానారెడ్డి రూ. 4, 20, 924 చెల్లించాలని..మొత్తం వీరిద్దరూ కలిపి రూ. 9, 00, 860 చెల్లించాల్సి ఉంటుందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.