గుజరాత్‌తో పోటీగా దూసుకెళ్తున్న తెలంగాణ

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం వృద్ధి కనబరిచింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో జీఎస్టీ కింద రూ.3,195 కోట్లు వసూలవగా, ఈ ఏడాది అది రూ.3,787 కోట్లకు చేరుకుంది. జనవరి జీఎస్టీ రాబడులకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే చండీగఢ్ రాష్ట్రంలో అత్యధిక వృద్ధి 22 శాతం నమోదయ్యింది.
తర్వాత గుజరాత్, మహారాష్ట్రలతో దీటుగా 19శాతం వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ నాలుగో స్థానానికి చేరుకుంది. తర్వాత కేరళలో 17శాతం వృద్ధి ఉందని గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో వసూలైన రూ.3,787 కోట్లతో కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను, పది నెలల కాలంలో మొత్తం రూ.24135.3 కోట్లు జీఎస్టీ ద్వారా వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31,186.67 కోట్లు జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని అంచనా వేయగా, అందులో 77.3 శాతం రాబడి వచ్చింది.
గతేడాది రూ.34,232.93 కోట్లు జీఎస్టీ రాబడులుంటాయని అంచనా వేయగా, 2019 మార్చి ముగిసే నాటికి 84.09 శాతం.. అంటే రూ.28,786.44 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది మరో 2 నెలలు మిగిలి ఉండటంతో రెండు నెలల్లో కలిపి మరో రూ.6 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర పనితీరును 15ఆర్ధిక సంఘం సభ్యుడు అజయ్‌నారాయణఝా కూడా ప్రశంసించారు.