బాబూ.. కనికరించరా?: తెలుగు తమ్ముళ్లకు నిరాశే!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతంత మాత్రంగా ఉన్న పార్టీని కాపాడి, పూర్వ వైభవం తీసుకొద్దామని అధినేత చంద్రబాబు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే బాబు తెలంగాణలో అక్కడక్కడా మిగిలి ఉన్న నాయకుల్లో, పార్టీపై అభిమానం ఉన్న కార్యకర్తల్లో నమ్మకం కలిగించేందుకు వారంలో ఒకరోజు ఎన్టీఆర్ భవన్‌కు వస్తున్నారు. తమ అభిమాన నాయకుడు బాబును చూసి ఆనందపడే వారు కొందరైతే… బాబుకి మొహం చూపించుకుని హాజరు వేసుకునే వారు మరికొందరు ఉంటున్నారు. కాకపోతే బాబూతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేవారు ఎక్కువ మంది ఉంటున్నారట.
గంటలు తరబడి వేచివున్నా :
నిజానికి పార్టీ జండా మోస్తూ పార్టీ పూర్వ వైభవం కోరుకుని, పార్టీ సమస్యలు, తమ సమస్యలను అధినేత దృష్టికి తీసుకెళ్దామని ఇలా చాలా మంది భవన్‌కు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ… కొండంత ఆశతో ట్రస్ట్ భవన్‌కు వచ్చిన తెలుగు తమ్ముళ్లకు గంటల తరబడి వేచి ఉన్నా నిరాశే మిగులుతుందట. సమస్యలు చంద్రబాబును కలిసి చెబుదామని ఆశగా వచ్చే తెలుగు తమ్ముళ్లకు నిరాశే ఎదురవుతోందంటున్నారు. బాబు తెలంగాణ కార్యకర్తలకు నేతలకు కేటాయించినదే వారంలో ఒక రోజు. అది కూడా సాయంత్రం వేళలో.
చంద్రబాబు చెప్పిన సమయానికి ఎప్పుడు వస్తారో? తెలియదు. వచ్చినా ఎంత సేపు ఉంటారో తెలియదు. ఆ కాస్త సమయంలోనే కలుద్దామంటే చంద్రబాబుకు ఆ తీరికే దొరకట్లేదని తెలుగు తమ్ముళ్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు వచ్చిన వెంటనే ఫొటోలు దిగేవారికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట.
సెల్ఫీలకే దాదాపు గంటన్నర సమయం పడుతోందంటే బాబుతో ఫొటోలు, సెల్ఫీల కోసం ఏ రేంజ్‌లో వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫొటోలు దిగే వారు వారంలో ఒక రోజు మాత్రమే వచ్చేవారు కాదు. వచ్చిన వారు మళ్లీమళ్లీ వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారట. మిగిలిన సమయం కాస్త ముఖ్య నేతలకు కేటాయిస్తుండటంతో బాబు విడిది కాస్త మూడు సెకన్లలో ఆరు సెల్ఫీలు అన్నట్లుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లేదంటే.. పార్టీ నుంచి జంప్ ఖాయం :
అధినేత చంద్రబాబు దృష్టికి కాకపోయినా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ వరకు విషయం చేరవేద్దామంటే ఆయనేమో అస్సలు అందుబాటులో ఉండరని కింది స్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా కార్యక్రమాలలో తప్ప సాధారణ రోజుల్లో ఎన్టీఆర్ భవన్ ఛాయలలో కూడా ఆయన కనిపించడం లేదని కొందరు ఆగ్రహంగా ఉన్నారట. ఆత్మాభి మానం చంపుకొని పక్క పార్టీకి వెళ్లకుండా ఇక్కడ అంతంత మాత్రంగా ఉన్న పార్టీ కోసం కృషి చేస్తుంటే అస్సలు తమని పట్టించుకునేవాడే లేడని లోలోపల బాధ పడిపోతున్నారట కార్యకర్తలు.
అధినాయకుడు బాబుకు ఖాళీ లేకపోవడం, రాష్ట్ర పార్టీ తరఫున ఉన్న నాయకుడు రమణ అందుబాటులో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఈ విషయంలో బాబు ఒక నిర్ణయం తీసుకోకుంటే ఉన్న కొద్ది మంది కూడా పార్టీ నుంచి జంప్ అయిపోవడం ఖాయం అంటున్నారు.