డోంట్ కేర్ : సీఎంలే చెప్పినా ‘టోల్’ తీస్తున్నారు

స్వయంగా సీఎంలే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన అదేశాలను డస్ట్ బిన్‌లో పడేశారు. ముందుకెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. టోల్ గేట్ యాజమాన్యాల తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. సంక్రాంతి రద్దీతో వాహనదారుల సౌలభ్యం కోసం టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 2019, జనవరి 13వ తేదీ ఆదివారం వాహనదారుల నుంచి ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయొద్దని, వారిని ఫ్రీగా వదిలేయాలని ఆదేశించారు. కానీ టోల్ గేట్ యాజమాన్యాలు మాత్రం కేర్ చెయ్యడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేశారు. టోల్ గేట్ల సిబ్బంది వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న జడ్చర్ల, నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ దగ్గర వసూళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ రద్దు చేసింది కదా మరి ఎందుకు వసూలు చేస్తున్నారని వాహనదారులు అడిగితే.. తాము NHAI పరిధిలో పని చేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తేనే టోల్ వసూలు నిలిపి వేస్తామని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. వాళ్లు అలా చెప్పడంతో వాహనదారులు అయోమయంలో పడిపోయారు. మరోదారి లేక టోల్ ఫీజు చెల్లించి ముందుకు కదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల చెల్లవు అని చెప్పిన టోల్ ప్లాజా సిబ్బందిపై కొందరు వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతా మోసం, దగా అని ఫైర్ అవుతున్నారు.
సంక్రాంతి పండక్కి నగరవాసులు సొంతూళ్లకు పయనం అయ్యారు. ఒక్కసారిగా లక్షలాది వాహనాలు రోడ్డెక్కడంతో నేషనల్ హైవేలపై భారీగా రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు టోల్ ప్లాజాల దగ్గర నిలిపేయడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోతున్నారు. దీంతో వాహనదారుల సౌలభ్యం కోసం టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కానీ అవి అమల్లోకి మాత్రం రాలేదు.