హనుమాన్ జయంతి : శోభాయాత్రకు అంతా సిధ్ధం

  • Published By: chvmurthy ,Published On : April 19, 2019 / 02:19 AM IST
హనుమాన్ జయంతి : శోభాయాత్రకు అంతా సిధ్ధం

Updated On : April 19, 2019 / 2:19 AM IST

హైదరాబాద్: శుక్రవారం నాడు హనుమాన్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడే ఒకే రోజు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హనుమాన్ శాభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా  అన్నిముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే వీరహనుమాన్ విజయయాత్రకు సర్వంసిధ్దం చేశామని బజరంగ్ దళ్  రాష్ట్ర కన్వీనర్ సుభాశ్ చందర్ తెలిపారు. శోభాయాత్ర ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామాలయం దగ్గర ప్రారంభమై, సాయంత్రం ఏడు గంటలకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ దగ్గరకు చేరుకుంటుంది. సుమారు 27 కిలోమీటర్ల మార్గంలో  శోభాయాత్ర కొనసాగుతుంది. హనుమాన్‌ శోభాయాత్రకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 వేల సిబ్బంది, 20 ప్లాటూన్‌లు రంగంలో ఉంటాయని, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం తెలిపారు. 

యాత్ర కొనసాగే మార్గంలో మొత్తం 450 సీసీ కెమెరాలున్నాయని, కమాండ్‌ కంట్రోల్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నామన్నారు. మహిళల భద్రతకు షీ బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రధాన ఉరేగింపు నగరంలోని మూడు జోన్లలో  27 కిలోమీటర్ల మేర జరగనుంది .  గౌలిగూడ రామమందిరం దగ్గిర ప్రారంభమై తాడ్ బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ముగస్తుంది.  అదే విధంగా తూర్పుమండలంలోని ఐఎస్ సదన్ నుంచి మరో  ఊరేగింపు 3 కిలోమీటర్లు సాగి గౌలి గూడ రామ్ మందిర్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తుంది. మొత్తంమ్మీద 15 ప్రాంకతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి.  సుమారు 2 లక్షలమంది భక్తులు శోభాయాత్రలో  పాల్గోంటారని అంచనా  వేస్తున్నారు. 

ఈ మార్గాల్లో కొనసాగనున్న శోభయాత్ర 
గౌలిగూడ రామ్ మందిర్  నుంచి  ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా,  ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, రామ్ కోఠి చౌరస్తా,  కాచిగూడ జంక్షన్ , వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, గాంధీనగర్,  కవాడీ గూడ, సికింద్రాబాద్‌ బాటా, బైబిల్‌ హౌస్‌ మీదుగా తాడ్‌ బండ్‌ వరకు శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే ఈ మార్గాన్ని సీపీ అంజనీ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ఎప్పటికప్పుడు శోభాయాత్ర మార్గాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఏయే మార్గాల్లో వెళ్తుందో, ఆ రూట్లలో శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. అలాగే.. వైన్‌ షాపులు, బార్లు, రెస్టారెంట్లను శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు బంద్‌ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.