తెలంగాణలో మళ్లీ ఎలక్షన్స్ : మేలో స్థానిక సంస్థల ఎన్నికలు

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇదివరకే ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు టీసర్కార్ సమాయత్తం అవుతుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన, శాసనసభా సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 20 బుధవారం హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టం అద్భుతంగా రూపొందిందని, అదే మాదిరిగా నగరాలు, పురపాలనకు కొత్త చట్టం అవసరమన్నారు. దీనిపై వెంటనే అధ్యయనం చేసి దాన్ని రూపొందించాలని ఆదేశించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దేశంలోని ఆదర్శ నగరాలు, పట్టణాలను సందర్శించి అక్కడి విధానాలను పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాలని సూచించారు. కొత్త పురపాలక చట్టాన్ని మే మాసంలో ఆమోదిస్తామని, దానికి అనుగుణంగా ఎన్నికలకు సన్నద్ధం కావాలని వెల్లడించారు.
2019-20 రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ టీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతుందని తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా.. సంతృప్తికరంగా అన్ని శాఖలకు కేటాయింపులు ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు నిధులుంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యాచరణ ఉంటుందన్నారు. బడ్జెట్ పద్దులకు తుదిమెరుగులు దిద్దారు సీఎం. ఫిబ్రవరి 22 శుక్రవారం నుంచి జరుగనున్న అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా సీఎం కేసీఆర్ చర్చించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, వ్యవసాయ, సంక్షేమ, శాసనసభా వ్యవహారాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్, శాసనసభ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.