కంటోన్మెంట్ రోడ్లపై ఆంక్షలు ఎత్తేయండి-కేటీఆర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో ఏదో ఒక సాకుతో పదే పదే రోడ్ల మూసివేయటం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆలేఖలో వివరించారు.
విధి విధానాలు పాటించకుండా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్‌ఎంఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల మూసివేతకు సంబంధించి 2018లో కేంద్ర రక్షణ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సైతం మిలటరీ అధికారులు పాటించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
కంటోన్మెంట్‌లో ఏవైనా రోడ్లు మూసివేయాలంటే ముందుస్తుగా స్థానిక పత్రికల్లో ప్రకటన ఇచ్చి, కంటోన్మెంట్ వెబ్‌సైట్‌లో వివరాలు వెల్లడిస్తూ, అక్కడి ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాతే మూసివేయాల్సి ఉందన్నారు. ఇవే మీ పాటించకుండానే జూలైలో పది రోజుల పాటు పలు రోడ్ల ను మూసేశారని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనల సాకుతో రోడ్లు మూసివేయ డం తగదన్నారు.
స్థానిక మిలటరీ అధికారుల చర్యల వల్ల రాజధానికి ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని సుమారు 10 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కంటోన్మెంట్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న రిసాల బజార్, బొల్లారం బజార్, లాల్‌బజార్ వంటి మార్కెట్ ప్రాంతాలకు తమ వస్తువులను తీసుకెళ్లేందుకు ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఈ రోడ్లను వినియోగించే వారని మంత్రి కేటీఆర్ తెలిపారు..
వీటితో పాటు రాజీవ్ రహదారిని కలిపే పలు రోడ్లను సైతం మూసేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఏఓసీ రోడ్లు సహా మిలటరీ అధికారులు మూసేసిన పలు రోడ్లు 100 ఏళ్లకు పైగా స్థానిక ప్రజలు వినియోగిస్తున్నవేనని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కంటోన్మెంట్ చట్టంలో ‘వీధులు’గా పేర్కొన్న రోడ్లను మూసి వేయాలంటే సెక్షన్ 258 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.