వాయిదాల పర్వం : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సమ్మె..ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కానీ..వాయిదాలు పడుతుండడంతో..కార్మికులు, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 18వ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చడం విశేషం.
కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకరాలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం ఇంకా పూర్తి కాలేదని..పూర్తయిన వెంటనే..జీవో ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వ తరపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు వీల్లేదన్నారు. మరోవైపు పిటిషనర్ అభ్యర్థన సరిగ్గా లేదని, ఆర్టీసీ రూట్లపై వేసిన పిటిషన్‌లో మార్పులు చేయాలని పిటిషనర్‌కు సూచించింది కోర్టు. అప్పటి వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని స్ఫష్టం చేసింది. ఇంకోవైపు ఆర్టీసీ కార్మికుల వేతనాల పిటిషన్‌ను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.
రూట్ల ప్రైవేటీకరణ, సమ్మె..జీతాల విషయాలు..విచారణ జరుపుతున్న కోర్టు..కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనకు సర్కార్ నో చెప్పింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ..సమ్మె ఇల్లీగల్ అని ఎలా చెపుతారని ఏజీని ప్రశ్నించింది. ఈసందర్భంగా గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏజీ ప్రస్తావించారు. నవంబర్ 18వ తేదీన జరిగే విచారణకు ఎండ్ కార్డు పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.
Read More : లోక కళ్యాణం కోసం పీసీసీ పదవి అడుగుతున్నా : జగ్గారెడ్డి