ఆర్టీసీ సమ్మె ఉధృతం : కుటుంబసభ్యులతో బైఠాయింపు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమౌతోంది. కార్మికులు కదం తొక్కుతున్నారు. సమ్మె 10వ రోజుకు చేరుకుంది. డిపోల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. పలు దశలుగా నిరసనలు చేపడుతున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట భైఠాయించారు. ఆర్టీసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. వారి పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనకు మద్దతు పలికారు.
హైదరాబాద్ ముషిరాబాద్ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, కండక్టర్ సురేంద్రగౌడ్‌ల ఫొటోలకు నివాళులర్పించారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం బస్ డిపో ఎదుట కార్మక సంఘాలు నేతలు ఆందోళనకు దిగారు. సమ్మెకు మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్‌లోని బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడనే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మద్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.
అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతర డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు. సమ్మెను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్టోబర్ 06వ తేదీన సాయంత్రం వరకు విధులకు హాజరు కాని వారి ఉద్యోగాలు తీసేసినట్లు, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియామకాలు చేపట్టింది. వంద శాతం బస్సులను రోడ్లపైకి తీసుకరావాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.