సంక్రాంతి పండగకున్న ప్రత్యేకత ఏంటి?

మకర సంక్రాంతి ముచ్చటగా మూడురోజులు జరుపుకునే పండగ. తెలుగులోగిళ్లలో ఇది ఆనంద హేల. దేశవ్యాప్తంగాను ఈ పండగకు ప్రాధాన్యత ఉంది.

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 01:26 AM IST
సంక్రాంతి పండగకున్న ప్రత్యేకత ఏంటి?

Updated On : January 14, 2020 / 1:26 AM IST

మకర సంక్రాంతి ముచ్చటగా మూడురోజులు జరుపుకునే పండగ. తెలుగులోగిళ్లలో ఇది ఆనంద హేల. దేశవ్యాప్తంగాను ఈ పండగకు ప్రాధాన్యత ఉంది.

మకర సంక్రాంతి ముచ్చటగా మూడురోజులు జరుపుకునే పండగ. తెలుగులోగిళ్లలో ఇది ఆనంద హేల. దేశవ్యాప్తంగాను ఈ పండగకు ప్రాధాన్యత ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. అసలు సంక్రాంతి పండగకున్న ప్రత్యేకత ఏంటి?

సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడమే… ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ రెండు సంక్రమణాలకే ప్రాముఖ్యత ఉంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణగా భావిస్తారు. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు దక్షిణాయనంలోకి వెళ్లినప్పుడు, ఆ కాలాన్ని కలికాలం అని కూడా పిలుస్తారు. ఇలా పుణ్యకాల ప్రారంభాన్ని ఒక పండుగలా జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఉంటారు.  అందుకే సంక్రాంతిని  రైతుల పండుగగా  అభివర్ణిస్తారు. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకుని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి.

సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి,  రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును ముక్కనుమగానూ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగిమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనిపిస్తారు.

మొదటి రోజు జరుపుకునే భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

సంక్రాంతి రోజున ప్రతి ఇంటీ ముంగిలీలో రంగవల్లులు శోభాయమానంగా కనిపిస్తాయి.  ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ప్రాధాన్యముంది. పంటలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపధ్యంలో కొత్త పంట చేతికి వచ్చి ధాన్యరాశులలో చేరేది ఈ రోజుల్లోనే. దీంతో సంక్రాంతిని అతిపెద్ద పండగగా చెబుతుంటారు. చక్కెరతో కలిపిన నువ్వులు, నూల ఉండలు, ఇతర భక్ష్యాలు, పిండివంటలు ఆరగిస్తారు. పసుపు, కుంకుమ, సుగంధద్రవ్యాలు, బియ్యం, బెల్లం, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానాలుగా సమర్పించడం ఆనవాయితీ. 

మూడో రోజు కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన గోవులను..పశువులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతులకు నేస్తాలే. అందుకే పల్లెల్లో రైతులు తమ  ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు.