Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు బిగ్ షాక్.. 17ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

దీనిపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పాకిస్తాన్ (పీటీఐ) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించింది.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు బిగ్ షాక్.. 17ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

Updated On : December 20, 2025 / 4:39 PM IST

Imran Khan: ఇప్పటికే ఓ కేసులో జైల్లో మగ్గిపోతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇది మరో భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి స్థానిక కోర్టు షాక్ ఇచ్చింది. అవినీతి కేసులో వారికి 17ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. తోషాఖానా 2 అవినీతి కేసులో కోర్టు వీరికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును ప్రకటించారు.

తోషాఖానా కేసు 2021లో నమోదైంది. ఇమ్రాన్ ఖాన్ దంపతులు సౌదీ ప్రభుత్వం నుండి అందుకున్న రాష్ట్ర బహుమతుల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ది డాన్ పత్రిక ప్రకారం, ఈ కేసు మే 2021లో నమోదైంది. అధికారిక పర్యటన సందర్భంగా సౌదీ యువరాజు ఖాన్‌కు బహుమతిగా ఇచ్చిన ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సంబంధించింది. దాదాపు రూ.80 మిలియన్ల విలువైన ఆ ఆభరణాల సెట్‌ను పీటీఐ వ్యవస్థాపకుడు కేవలం రూ. 2.9 మిలియన్లు చెల్లించి తన వద్దే ఉంచుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది.

పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద ఖాన్, బుష్రాకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అంతేకాదు రూ.10 మిలియన్ల చొప్పున జరిమానా కూడా విధించింది.

“ఈ కోర్టు, శిక్షలు విధించేటప్పుడు ఇమ్రాన్ ఖాన్ వృద్ధాప్యాన్ని, అలాగే బుష్రా ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళ అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని తక్కువ శిక్ష విధిస్తూ ఉదారంగా వ్యవహరించింది” అని డాన్ పత్రిక కోర్టు ఉత్తర్వుల గురించి తెలిపింది.

దీనిపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పాకిస్తాన్ (పీటీఐ) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించింది. ”ఇమ్రాన్ ను చూసేందుకు కుటుంబసభ్యులను జైలులోకి అనుమతించని కోర్టు.. తోషాఖానా 2 కేసులో తీర్పు ఇవ్వడం విడ్డూరంగా ఉంది” అని మండిపడింది. “మూసివేసిన తలుపుల వెనుక జైలులో జరిగే విచారణ స్వేచ్ఛాయుతమైనది కాదు, నిష్పక్షపాతమైనది కూడా కాదు. వాస్తవానికి అదొక సైనిక విచారణ,” అని పీటీఐ ధ్వజమెత్తింది.

ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు విధించిన జైలు శిక్షపై మంత్రి అత్తావుల్లా తరార్ స్పందించారు. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ కు ఈ జైలు శిక్ష ప్రారంభమవుతుందని చెప్పారు. కోర్టు తీర్పును తరార్ స్వాగతించారు. ఇమ్రాన్, ఆయన భార్య బహుమతులను తక్కువ ధరకు అంచనా వేయించి, వాటిని వ్యక్తిగత ఉపయోగం కోసం ఉంచుకోవడం ద్వారా “మోసానికి” పాల్పడ్డారని ఆరోపించారు. పీటీఐ వ్యవస్థాపకుడు, ఆయన భార్య ప్రజా విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

Also Read: సహజీవనంలో ఏది తప్పు? ఏది రైట్? అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. పెళ్లయిన వారికి..