Russian Soldiers Killed In War : యుద్ధంలో 18,900 మంది రష్యా సైనికులు మృతి – యుక్రెయిన్ ఆర్మీ

సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల 900 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.(Russian Soldiers Killed In War)

Russian Soldiers Killed In War : యుద్ధంలో 18,900 మంది రష్యా సైనికులు మృతి – యుక్రెయిన్ ఆర్మీ

Russian Soldiers Killed (2)

Updated On : April 7, 2022 / 4:33 PM IST

Russian Soldiers Killed In War : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. నెల రోజులకు పైగా యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. యుక్రెయిన్‌ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగిసిపోలేదని అర్థమవుతోంది.

యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. యుక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.(Russian Soldiers Killed In War)

Ukraines Crisis:తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్ గళం.. బుచాలో పౌరుల హత్యలపై దర్యాప్తుకు డిమాండ్

తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. సైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల 900 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. దీంతోపాటు 698 యుద్ధ ట్యాంకులు, 1891 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 150 యుద్ధవిమానాలు, 135 హెలికాప్టర్లు, 111 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 55 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.(Russian Soldiers Killed In War)

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు నగరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది రష్యా. కాగా, యుక్రెయిన్‌పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే వార్తలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేశాయి. దీనిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్‌ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది.

Czech Republic : పుతిన్‌కు షాక్.. యుక్రెయిన్‌కు మద్దతుగా చెక్ రిపబ్లిక్.. పవర్‌ఫుల్ ఆయుధాలు సరఫరా

మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా దాడుల మొదలు ఇప్పటివరకు 167 మంది చిన్నారులు మృతి చెందినట్లు యుక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. 297 మంది గాయపడినట్లు చెప్పింది. మరియుపోల్‌ తదితర నగరాల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు రాని నేపథ్యంలో.. ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే.. యుక్రెయిన్‌ వ్యాప్తంగా ఆయా నగరాల్లోని నాలుగు ఇంధన నిల్వ కేంద్రాలను తమ క్షిపణులు ధ్వంసం చేశాయని రష్యా రక్షణశాఖ గురువారం ప్రకటించింది. బుధవారం రాత్రి మైకోలైవ్‌, ఖార్కివ్‌, జపోరిజియా, చుహివ్‌లలో ఈ దాడులు జరిపినట్లు వెల్లడించింది. మైకోలైవ్, ఖార్కివ్ నగరాల సమీపంలో, డాన్‌బాస్ ప్రాంతంలోని తమ దళాలకు ఇంధనం సరఫరా చేయడానికి యుక్రెయిన్ ఈ కేంద్రాలను ఉపయోగించిందని తెలిపింది. దీంతోపాటు నాలుగు కాలిబర్‌ క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించి.. యుక్రెయిన్‌ మిలిటరీ సౌకర్యాలను నాశనం చేసినట్లు ట్వీట్‌ చేసింది.

కాగా, ఈ యుద్ధం కారణంగా రష్యా దగ్గర పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్‌ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు, క్రూయిజ్‌ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను యుక్రెయిన్‌ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్‌ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో అవి పూర్తిగా ఆగిపోయాయి.

తమ వ్యూహాన్ని మార్చుకుని దాడి చేసేందుకే రష్యన్లు వెనక్కుమళ్లారని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వాళ్లకు విజయం కావాలని అన్నారు. మే 9వ తేదీ (నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుతుంటుంది) వాళ్లకు ఎంతో కీలకం. అందుకు ఇంకా సమయం ఉంది. ఆలోపు ఏదైనా జరగొచ్చు. కాబట్టి మనం ముందు ముందు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చని జాతిని, సైన్యాన్ని ఉద్దేశించి జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న మారణహోమాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆ హింసాకాండను నమ్మశక్యం కానీ క్రూరత్వం అని ఖండించాయి.