Pakistan Gold Reserves: పాకిస్థాన్ పంట పండింది.. అక్కడ ఎన్ని వేలకోట్ల విలువైన బంగారం నిక్షేపాలున్నాయో తెలుసా..
పాకిస్థాన్ లో బంగారం నిల్వలతో ఆ దేశానికి మంచిరోజులు రాబోతున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్ మాజీ మైనింగ్ ఇబ్రహీం హసన్ మురాద్ ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం..

Pakistan Gold Reserves
Pakistan Gold Reserves: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుంది. ఆ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేదిస్తోంది. గత దశాబ్దకాలంలో 1.5శాతం నుంచి 7శాతానికి నిరుద్యోగ రేటు పెరిగింది. భారతదేశం, బంగ్లాదేశ్ కంటే పాకిస్థాన్ లో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. అదేవిధంగా పాకిస్థాన్ జీడీపీ వృద్ధి రేటు ఆ దేశంలోని ఆరోగ్య, విద్య రంగాల అవసరాలను తీర్చడానికి కూడా సరిపోదు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఉల్లి, చెక్కర ఇలా ఏది తీసుకున్నా భారీగా ధరలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు లేక దేశంలోని మధ్య తరగతి ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దశ తిరగబోతుందా..? బంగారంతో పాకిస్థాన్ ధనిక దేశంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
పాకిస్థాన్ లో బంగారం నిల్వలతో ఆ దేశానికి మంచిరోజులు రాబోతున్నట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడటంతో.. మళ్లీ దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్న ఆశ అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రదేశంగా చూస్తున్న పాకిస్థాన్ కు భవిష్యత్తులో మంచి రోజులు వచ్చినట్లేనని కొందరు నిపుణులు చెబుతున్నారు.
సింధు నది ప్రపంచంలోని పురాతన, పొడవైన నదుల్లో ఒకటి. పాకిస్థాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుతుంటుంది. ఈ క్రమంలో సింధు నది, హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, అవి సింధూ నది ద్వారా పాకిస్థాన్ పరీవాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్పీ) నిర్ధారించింది.
నదిలో సుమారు 32 కిలో మీటర్ల వరకు బంగారు నిల్వలు విస్తరించి ఉన్నాయి. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తున్వా ప్రావిన్స్ లలోనేకాక.. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. అయితే, వీటి వెకితీతకు పాకిస్థాన్ సిద్ధమవుతుంది. అటోక్ జిల్లాలోని సింధూ నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై అక్కడి ప్రభుత్వం దృష్టిసారింది.
పంజాబ్ మాజీ మైనింగ్ ఇబ్రహీం హసన్ మురాద్ ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం.. అటోక్ జిల్లాలో 32కిలో మీటర్ల విస్తీర్ణంలో 28 లక్షల తులాల బంగారం నిల్వలు కొనుగొనబడిందని, దీని విలువ 80వేల కోట్ల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు 24వేల కోట్లకుపైగా) ఉంటుందని చెప్పాడు. పాకిస్థాన్ జియోలాజికల్ సర్వే కూడా దీన్ని ధృవీకరించిందట. అయితే, బంగారం నిల్వలపై మరింత శోధన జరుగుతుందని పేర్కొన్నాడు.
Attock’s Gold: A 800 Billion PKR Treasure Revealed
Former Mining Minister of Punjab, Ibrahim Hasan Murad, has unveiled a groundbreaking discovery: 2.8 million tolas of gold, valued at 800 billion PKR, spread across a 32-kilometer stretch in Attock. This revelation, validated by… pic.twitter.com/kmyv9QnvGx
— Ibrahim Hasan Murad (@ibrahimhmurad) January 10, 2025