నేను బతికే ఉన్నా.. జనాల మధ్యకు వచ్చిన కిమ్!

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 02:28 AM IST
నేను బతికే ఉన్నా.. జనాల మధ్యకు వచ్చిన కిమ్!

Updated On : May 2, 2020 / 2:28 AM IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (36) మృతిపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. కిమ్ కోమాలోకి మృతిచెందారంటూ గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా కనిపించని కిమ్.. ఒక్కసారిగా దేశ ప్రజలకు ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. తాను బతికే ఉన్నాననే వాస్తవాన్ని ఆయన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా తెలియజేసినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా నివేదించింది. ఏప్రిల్ 11 నుంచి కిమ్ కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యంపై ఎన్నో వదంతులు వ్యాపించాయి. కిమ్ చనిపోయారంటూ వార్తలు గుప్పుమన్నాయి. 

హార్ట్ సర్జరీ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లిపోయిన కారణంగానే ఏప్రిల్ 15న కిమ్ తన తాతయ్య  Kim Il-sung 108వ జయంతి వేడుకల్లో పాల్గొనలేదని వార్తల సారాంశం. వీటిన్నింటికి చెక్ పెడుతూ కిమ్ జనం మధ్యలోకి వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. Sunchonలోని ఓ కంపెనీ నిర్మాణానికి సంబంధించి కార్యక్రమంలో కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్‌తో కలిసి హాజరైనట్టు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని కిమ్ ప్రారంభించినట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ, ఈ నివేదికను స్టేట్ మీడియా మాత్రం స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. 

కిమ్ జనాల మధ్యకు వచ్చారన్న వార్తపై ఇప్పటివరకూ అంతర్జాతీయ మీడియా స్పందించలేదు. కిమ్ ఆరోగ్యంపై ఆరా తీసేందుకు చైనా సైతం తమ వైద్య బృందాన్ని ఉత్తరకొరియాకు పంపింది. అమెరికా కూడా ఉత్తరకొరియాలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తోందని అధికారులు వెల్లడించారు. కిమ్ మృతిచెందారనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.