Russian plane: రష్యా విమానం కుప్పకూలి.. 65 మంది యుద్ధ ఖైదీల మృతి

విమానం కూలిపోతుండగా తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ కనపడుతున్నాయి.

Russian plane: రష్యా విమానం కుప్పకూలి.. 65 మంది యుద్ధ ఖైదీల మృతి

Russian plane

Updated On : January 24, 2024 / 4:33 PM IST

ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా ఇల్యుషిన్-76 సైనిక రవాణా విమానం కుప్పకూలిపోయింది. దాదాపు 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలు ఈ ప్రమాదంలో మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

విమానంలో 65 మంది యుద్ధ ఖైదీలు, ఆరుగురు సిబ్బందితో పాటు మరో ముగ్గురు ఉన్నారని రియా రష్యా వార్తా సంస్థ తెలిపింది. విమానంలో ప్రయాణించిన వారి వివరాలు తెలియరాలేదు. రష్యాకు చెందిన ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఈ విమానంలోనే మిస్సైళ్లను కూడా రవాణా చేస్తున్నారని ఉక్రెయిన్‌ వార్తా సంస్థ తెలిపింది.

విమానం కూలిపోతుండగా తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ కనపడుతున్నాయి. ప్రమాదం జరగడానికి ముందు ఆ విమానం వేగంగా కింది వైపునకు దూసుకువస్తున్న దృశ్యాలు అందులో చూడొచ్చు. విమానంలో మంటలు చెలరేగాయి.

రష్యా అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విమాన ప్రమాదంపై స్పందిస్తూ.. ఈ విషయం గురించి తెలుసని అన్నారు. అయితే అందుకు సంబంధించిన వివరాలను చెప్పేందుకు మాత్రం ఒప్పుకోలేదు. ఖైదీల అప్పగింతలో భాగంగా విమానం బెల్గోరాడ్ ప్రాంతానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు.