ట్రంప్ తాజ్ మహాల్ రైడ్ కోసం స్పెషల్ బ్యాటరీ బస్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్.. ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్ మహాల్ ను సందర్శించనున్నారు. ట్రంప్ రైడ్ కోసం ప్రత్యేకించి బ్యాటరీ బస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం తాజ్ మహాల్ కు సమీపంలోని 500 మీటర్ల లోపు పరిసర ప్రాంతాల్లో కాలుష్య భరిత వాహనాలకు అనుమతి లేదు. అందుకే ట్రంప్ పర్యటన కోసం ప్రత్యేకమైన బ్యాటరీ బస్ ఏర్పాటు చేసినట్టు ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీ (ADA)ఒక ప్రకటనలో వెల్లడించింది.
వివిఐపీలు పర్యటించేందుకు మాత్రమే అధికారం కలిగిన ఈ స్పెషల్ బ్యాటరీ బస్ లో ట్రంప్ పర్యటించేందుకు ఇదొక్కటే మార్గమని పేర్కొంది. మరోవైపు అమెరికా సీక్రెట్ సర్వీసు విభాగం మాత్రం డొనాల్డ్ ట్రంప్ తమ వ్యక్తిగత సాయుధ వాహనంలోనే తాజ్ మహాల్ సందర్శనకు వెళ్లాలని కోరుతోందని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభూ ఎన్ సింగ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే సీక్రెట్ సర్వీసు విభాగానికి ట్రంప్.. తాజ్ మహాల్ సందర్శనకు ప్రత్యేకమైన బ్యాటరీ బస్ లోనే వెళ్లాల్సి ఉంటుందని సమాచారమిచ్చినట్టు ఆయన చెప్పారు.
వివిఐపీలు భారత్ లోని చారిత్రక ప్రదేశాలైన ఉదాయ్ పూర్ లోని శిల్పాగ్రామ్ నుంచి ఆగ్రాలోని తాజ్ మహాల్ వరకు ఈ బ్యాటరీ బస్సులోనే సందర్శించాల్సి ఉంటుందని సింగ్ స్పష్టం చేశారు. గతంలో ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, బ్రిటీష్ రాయల్ కపుల్ ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్ టన్ కూడా ఇదే బ్యాటరీ బస్సులో సందర్శించినట్టు తెలిపారు. 2015లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించేందుకు అప్పుడు కూడా అదే బస్సును సిద్ధం చేయగా.. చివరి క్షణాల్లో ఆగ్రా ట్రిప్ రద్దు అయినట్టు సింగ్ చెప్పారు.
ఆగ్రాకు ట్రంప్ చేరుకోగానే.. సుప్రీం ఆదేశాల ప్రకారం.. బ్యాటరీ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రంప్ పర్యటన కోసం సుప్రీంకోర్టు తాత్కాలిక అనుమతిని ఇవ్వకపోతే మాత్రం ఏడీఏ ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక బ్యాటరీ బస్సు తప్ప మరొకటి లేదు. ఫిబ్రవరి 24న సోమవారం నాడు డొనాల్డ్ ట్రంప్.. తన భార్య మెలానియా ట్రంప్ తో కలిసి భారత్ లో పర్యటించనున్నారు. ముందుగా ట్రంప్ అహ్మదాబాద్ లో జరిగే నమస్తే ట్రంప్ మెగా ఈవెంట్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆయన సతిసమేతంగా ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్ మహాల్ సందర్శిస్తారు. చివరిగా ఢిల్లీకి చేరుకుంటారు.