ఆంగ్ సాన్ సూకీపై ఆర్మీ కక్ష!..పోలీసుల సోదాలు, వాకీటాకీల స్వాధీనం

ఆంగ్ సాన్ సూకీపై ఆర్మీ కక్ష!..పోలీసుల సోదాలు, వాకీటాకీల స్వాధీనం

Updated On : February 4, 2021 / 12:45 PM IST

Aung San Suu Kyi : మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌ సాన్‌ సూకీపై ఆ దేశ ఆర్మీ కక్ష కట్టినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆర్మీ.. ఇప్పుడు ఆమెపై కొత్త ఆరోపణలు ప్రారంభించింది. సూకీపై ఆ దేశ పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు ఆమె ఇంట్లో లభ్యమైనట్లు తెలిపారు. ఈ కేసులో సూకీని ఫిబ్రవరి 15దాకా నిర్బంధంలో ఉంచుతామన్నారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ కాని వాకీటాకీలను సూకీ భద్రతా సిబ్బంది వాడారని ఆరోపించారు.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని మయన్నార్ సైన్యం కూలదోసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీని విధించింది. రాజధాని నేపిడాలో ప్రభుత్వ గృహ సముదాయంలోనే ఎంపీలను నిర్భంధంలో ఉంచింది. వారిపై ఆక్రమ కేసులు పెట్టి బయటకు రానివ్వకుండా ఉండేందుకు ఆర్మీ స్కెచ్‌ వేసింది. ఇప్పుడు ఏకంగా ఆంగ్‌ సాన్‌ సూకీపై తప్పుడు ఆరోపణలతో కేసు బుక్‌ చేసింది. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీ టాకీలను కలిగిఉన్నారని ఆమెను మరింత కాలం నిర్బంధంలో ఉంచేందుకు ఐడియా రూపొందించి.. దాన్ని పక్కాగా అమలు చేసింది.

మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారని అధ్యక్షుడు మింట్‌పైనా అభియోగాలు నమోదు చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ మయన్మార్‌ సైన్యం అధికారాన్ని చేజిక్కించుకొవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు ఆ దేశ ప్రజాస్వామ్య నేతలపై అక్రమ ఆరోపణలు చేయడాన్ని ప్రపంచ దేశాలు తప్పుపడతున్నాయి. ఇది సైన్యం చేసిన కుట్ర కాకపోతే మరేంటని ప్రశ్నిస్తున్నాయి.

వాకీటాకీలను సూకీ ఇంట్లో దాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ నుంచి 10 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అవన్ని వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న వాకీటాకీలుగా తేల్చారు. వాస్తవానికి వాకీటాకీలను వాడడం తప్పు కాదు. అది కూడా ఒక దేశ అధినేతకు వాటిని వాడడంతో అన్ని హక్కులు ఉన్నాయి. దీనిపైనే ప్రజాస్వామ్యవాదులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అసలు వాకీటాకీలను కలిగి ఉండడం ఏ విధంగా నేరమో చెప్పాలని అడుగుతున్నారు. సూకీని అక్రమంగా సంవత్సరాలు పాటు నిర్భందంలో ఉంచాలని ఆర్మీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. వాకీటాకీలను ఎన్నికల కోసం దుర్వినియోగం చేసుకున్నరని పోలీసులు చెబుతుండగా.. అదే నిజమని తేలితే సూకీకి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.