Chinmoy Krishna Das: మరో నెల రోజులు జైల్లోనే.. చిన్మోయ్ కృష్ణదాస్ బెయిల్ విచారణ ఎందుకు వాయిదా పడిందంటే..?
చిన్మయ్ కృష్ణ దాస్ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి

Chinmoy Krishna Das
Chinmoy Krishna Das Bail: బంగ్లాదేశ్ లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ అయిన ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ మరో నెల రోజులు జైల్లో ఉండాల్సి పరిస్థితి తలెత్తింది. బంగ్లాదేశ్ కోర్టు అతని బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి బెయిల్ పిటిషన్ ను ఇవాళ విచారించాల్సి ఉంది. కానీ, కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణంగా విచారణ చేపట్టకుండానే నెల రోజుల తరువాత విచారణ జరుపుతామని కోర్టు వాయిదా వేసింది.
వాస్తవానికి చిన్మయ్ కృష్ణ దాస్ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి నేపథ్యంలో మిగిలిన లాయర్లు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు వినిపించేందుకు ముందుకు రాలేదు. చిన్మయ్ కృష్ణ దాస్ పై ప్రభుత్వం కక్షగట్టిందని, ఆయన తరపున వాదించకుండా దాదాపు 70 మంది లాయర్లపై తప్పుడు కేసుల్లో ఇరికించిందని బంగ్లాదేశ్ సమ్మిళత సనాతని జాగరణ జోట్ ఆరోపించింది.
Also Read: Pawan Kalyan: కలిసి పోరాడదాం.. బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కల్యాణ్
చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు రవీంద్ర ఘోష్ అనే న్యాయవాది ఢాకా నుంచి దాదాపు 250 కిలో మీటర్ల ప్రయాణించి కోర్టు ఆవరణకు వచ్చాడు. అయితే అతడిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదని ఇస్కాన్ కోల్ కతా ప్రతినిధి రాధారామన్ దాస్ ఆరోపించారు. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు ముందుకొచ్చిన వారిపట్ల బంగ్లా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుండటంతోపాటు.. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేయడంతో కోర్టులో వాదనలు వినిపించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇవాళ జరగాల్సిన విచారణను కోర్టు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అప్పటి వరకూ చిన్మయ్ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.