ప్రపంచ బిలియనీర్ల జాబితా.. జెఫ్ బెజోస్ ను దాటేసిన మార్క్ జుకర్ బర్గ్.. ఏఐ కారణమా..

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మెటా ప్లాట్‌ఫారమ్‌ల సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు.

ప్రపంచ బిలియనీర్ల జాబితా.. జెఫ్ బెజోస్ ను దాటేసిన మార్క్ జుకర్ బర్గ్.. ఏఐ కారణమా..

Mark Zuckerberg

Updated On : October 4, 2024 / 2:18 PM IST

Mark Zuckerberg: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మెటా ప్లాట్‌ఫారమ్‌ల సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ను అధిగమించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం నికర విలువ 206 బిలియన్ల డాలర్లు. జెప్ బెజోస్ 205 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ఉన్నాడు. మస్క్ నికర విలువ 256 బిలియన్ డాలర్లు. అయితే, 500 మంది సంపన్నులలో జుకర్ బర్గ్ సంపద ఈ ఏడాది ఎక్కువగా పెరిగిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది.

 

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో జుకర్ బర్గ్ రెండో స్థానానికి చేరుకోవటం ఇదే తొలిసారి. ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి. 2024 ప్రారంభం నుంచి మెటా షేర్లు 70శాతం పెరిగాయి. ఇది జుకర్ బర్గ్ సంపదను కూడా పెంచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో కంపెనీ పెట్టుబడులను చూసి మదుపర్లు ఉత్సాహంగా ఉన్నారు. మెటా తన అమ్మకాల వృద్ధికి ఏఐ పెట్టుబడులు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఏఐ చాట్ బాట్ లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు 23శాతం పెరిగాయి. ఫలితంగా గురువారం నాటి ట్రేడింగ్ సెసన్ లో సంస్థ షేరు విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి 582.77డాలర్ల వద్ద ముగిసింది.

మెటా ఏఐ రేసులో ముందుండేందుకు డేటా సెంటర్ లు, కంప్యూటింగ్ పవర్ పై పెద్దెత్తున డబ్బులను వెచ్చిస్తోంది. తాజాగా ఓరియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ ను కూడా పరిచయం చేసింది. మెటా 2022 చివరిలో 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది ఒక పెద్ద ఖర్చు తగ్గించే ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ నిర్ణయం కంపెనీ మళ్లీ పురోభివృద్ధికి దోహదపడింది. ఇదిలాఉంటే.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతదేశానికి చెందిన బిలియనీర్ ముకేశ్ అంబానీ 107 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానంలో ఉండగా.. 100 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు.

 

టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల జాబితా
ఎలోన్ మస్క్ – 256 బిలియన్ డాలర్లు
మార్క్ జుకర్‌బర్గ్ – 206 బిలియన్ డాలర్లు
జెఫ్ బెజోస్ – 205 బిలియన్ డాలర్లు
బెర్నార్డ్ ఆర్నాల్డ్ – 193 బిలియన్ డాలర్లు
లారీ ఎల్లిసన్ – 179 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ – 161 బిలియన్ డాలర్లు
లారీ పేజీ – 150 బిలియన్ డాలర్లు
స్టీవ్ పామర్ – 145 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ – 143 బిలియన్ డాలర్లు
సెర్గీ బ్రిన్ – 141 బిలియన్ డాలర్లు