రష్యా, జపాన్‌ తీరాలను తాకిన సునామీ.. పోర్టులు డ్యామేజ్, మునిగిన భవనాలు, తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు.. వీడియోలు ఇదిగో

రష్యా, జపాన్‌లో సంభవించిన సునామీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా తీర ప్రాంత భవనాలు నీటమునగడం ఇందులో చూడొచ్చు.

రష్యా, జపాన్‌ తీరాలను తాకిన సునామీ.. పోర్టులు డ్యామేజ్, మునిగిన భవనాలు, తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు.. వీడియోలు ఇదిగో

Updated On : July 30, 2025 / 1:41 PM IST

రష్యా కమ్‌చాట్‌కా ద్వీపకల్పం సమీపంలో సంభవించిన భారీ భూకంపం (8.8 తీవ్రత) కారణంగా జపాన్, రష్యా తీర ప్రాంతాలను సునామీ అలలు తాకాయి. ఈ భూకంపం హొక్కైడో నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. సునామీ కారణంగా పోర్టుల నిర్మాణాల్లో నష్టం వాటిల్లిందని, జపాన్ తీరంలోకి నాలుగు తిమింగలాలు కొట్టుకువచ్చాయని BNO న్యూస్ తెలిపింది.

అమెరికా భూకంపశాస్త్ర సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇప్పటివరకు నమోదైన ఆరో అతిపెద్ద భూకంపం. జపాన్ జాతీయ ప్రసార సంస్థ NHK భారీ అలలు ఇంకా వస్తాయని హెచ్చరించింది. జపాన్ వాతావరణ శాఖ, ఉత్తర తూర్పు తీర ప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తుతో అలలు వాకాయామా వరకు చేరే అవకాశముందని ముందుగా వెల్లడించింది.

ఈ భారీ సముద్రపు భూకంపం కారణంగా రష్యా, జపాన్‌లో ప్రజలు ఆయా ప్రాంతాలను ఖాళీచేశారు. రష్యాలో సంభవించిన సునామీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా తీర ప్రాంత భవనాలు నీటమునగడం ఇందులో చూడొచ్చు.

రష్యా దూర తూర్పు భాగమైన సహాలిన్ ప్రాంతంలో ఉన్న ఉత్తర కురిల్ ద్వీపాల్లో బుధవారం ఎమర్జెన్సీని ప్రకటించారు. తూర్పు రష్యా గవర్నర్ ప్రజలను “తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి” అని హెచ్చరించారు.

ఈ భూకంపం 19 కిలోమీటర్ల లోతులో, పెట్రోపావ్లోవ్‌స్క్-కమ్‌చాట్‌స్కీ నగరానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సునామీ అలలు 4 మీటర్ల ఎత్తులో వచ్చి పలు ప్రాంతాల్లో నష్టాన్ని కలిగించాయి. “ఈరోజు సంభవించిన భూకంపం గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైనది” అని కమ్‌చాట్‌కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ వీడియో సందేశంలో తెలిపారు.

కమ్‌చాట్‌కా దక్షిణంలో ఉన్న చిన్న పట్టణమైన సేవెరో-కురిల్స్‌క్‌లో ప్రజలను ఇంటి నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. జపాన్, హవాయి,  పసిఫిక్ సముద్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ వాతావరణ సంస్థ తెల్లవారుజామున తీర పట్టణాలను 3 మీటర్ల ఎత్తున అలలు తాకవచ్చని హెచ్చరించింది.

అమెరికా అధికారులు గువాం, ఇతర మైక్రోనేషియా ద్వీపాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో, ప్రజలను “సురక్షితంగా ఉండండి” అని విజ్ఞప్తి చేశారు. “పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించిన కారణంగా హవాయి ప్రజలకు సునామీ హెచ్చరిక జారీ అయింది తాజా సమాచారం కోసం tsunami.gov వెబ్‌సైట్‌ చూడండి” అని అన్నారు.

Trump Message on TSunami