Mutant Ebola virus: ఎబోలాను పోలిన డెడ్లీ వైరస్‌ను సృష్టించిన చైనా

కరోనా వ్యవహారంలో చైనా తీరు గమనించిన తర్వాత దీనిపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Mutant Ebola virus: ఎబోలాను పోలిన డెడ్లీ వైరస్‌ను సృష్టించిన చైనా

ఆ వైరస్ సోకితే మూడురోజుల్లో మనిషి చచ్చిపోతాడు. కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలి.. చరిత్ర ఎరుగని బీభత్సం సృష్టించిన చైనాలోనే ఆ వైరస్ కూడా తయారయింది. అసలు చైనాలో ఏం జరుగుతోంది..? చైనా పరిశోధనశాలలు….మానవాళి వినాశనానికి పూనుకున్నాయా..?

మరో మహమ్మారి అన్ని దేశాలనూ ముంచెత్తడం ఖాయమన్న ప్రచారం వెనక అసలు ఉద్దేశమేంటి..? వైరస్ వెలుగు చూసిన ఆఫ్రికా సహా అన్నిదేశాలూ ఎప్పుడో మర్చిపోయిన ఎబోలాను పోలిన వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడెందుకు సృష్టించారు..? అసలు ముందే వచ్చే ముప్పును పసిగట్టి….దాన్ని ఎదుర్కొనేలా, తరిమికొట్టేలా సన్నద్ధమవడం సాధ్యమేనా..?

సరిగ్గా నాలుగేళ్ల క్రితం కరోనా ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందో ఎవ్వరూ మర్చిపోలేరు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా చెప్పినప్పటికీ…వూహాన్ ల్యాబ్‌లో వైరస్ సృష్టి జరిగిందని అమెరికా సహా పలు దేశాలు గగ్గోల పెట్టాయి. కరోనా పర్యవసానాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..అయితే మానవాళికి ముప్పు తప్పిపోలేదని…కరోనా లాంటి మరో మహమ్మారి ముంచుకొచ్చే ప్రమాదం ఉందని కొన్నాళ్లగా ప్రచారం జరుగుతోంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అయితే మరిన్ని వైరస్‌లు మనుషులకు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కోవిడ్ విధ్వంసం చూసిన తర్వాత చైనా ల్యాబుల్లో జరిగే ప్రయోగాలపై మాత్రం అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ప్రపంచమంతా చైనా వైపు భయంభయంగా చూస్తోంది. దీనికి కారణం చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన ఎబోలాను పోలిన వైరస్.

హెబీ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను తయారుచేశారు. మూడే మూడురోజుల్లో ఇది మనిషికి మరణశాసనం రాస్తుంది. ఎబోలా వైరస్ భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారుతుంది…అలా మారితే ఎలా ఎదుర్కోవాలి వంటి విషయాలపై అధ్యయనం చేయడానికి ఈ వైరస్‌ను సృష్టించారు చైనా శాస్త్రవేత్తలు.

ఎబోలా గురించి విస్తృత అవగాహన కలిగించేందుకు దీన్ని తయారుచేశారు. వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది..దాని లక్షణాలేంటి…వంటివాటిని పరిశీలిస్తున్నారు. వెసిక్యులర్ స్టొమటైటిస్ వైరస్ -VSVను ఈ పరిశోధనలకు ఉపయోగించారు. ఎబోలా వైరస్‌ నుంచి దీన్ని సేకరించారు. వైరస్ కణాల్లోకి ప్రవేశించడానికి కీలకంగా ఉండే గ్లైకో ప్రొటీన్‌ను సేకరించారు.

ఎలుకలపై ప్రయోగం
ఐదు మగ, ఐదు ఆడ సిరియా ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. ఇంజెక్షన్ ద్వారా వాటిలోకి వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎలుకల్లో ఎబోలా వైరస్ బారిన పడ్డ మనుషుల్లో వచ్చిన మార్పులు చోటుచేసుకున్నాయి. అవయవాలు పనిచేయకపోవడం సహా అనేక లక్షణాలతో ఎలుకలు చనిపోయాయి.

నరాల రుగ్మత, కంటిచూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ఎలుకల్లో కనిపించాయి. అత్యంత సురక్షితమైన ల్యాబ్‌ల అవసరం లేకుండా పరిశోధనలు చేసే వీలుండడంతో ఎలుకలపై వీటిని ప్రయోగించామని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల ఎబోలా వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలు, వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన చికిత్స విధానాలపై తేలిగా అధ్యయనం చేయవచ్చని తెలిపారు.

వైరస్ ఎక్కించిన తర్వాత మరణించిన ఎలుకలపై విస్తృత పరిశోధనలు చేశారు. వైరస్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పొట్ట, ప్రేగులు, మెదడు సహా కీలక భాగాల్లోని కణాలను నిర్వీర్యం చేసినట్టు గుర్తించారు. ఎబోలా సోకిన వారు మరణించడానికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఓ కారణం. ఈ పరిశోధనలతో ఎబోలాను అడ్డుకునేందుకు అవసరమైన టీకాలను, ఔషధాలను తయారుచేసే అవకాశముందని చైనా అంటోంది.

అయితే కరోనా వ్యవహారంలో చైనా తీరు గమనించిన తర్వాత దీనిపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగాలు, పరిశోధనల భద్రతపై సందేహాలు కలుగుతున్నాయి. పొరపాటున ఈ వైరస్ బయటకు వస్తే కలిగే పరిణామాలు మన ఊహకు అందవు. చైనా ఎబోలా ప్రయోగం చేసిందన్న విషయం బయటకు వచ్చిన తర్వాత అంటువ్యాధుల పరిశోధనలపై కీలక మార్గదర్శకాలు రూపొందించాలన్న డిమాండ్లు తలెత్తుతున్నాయి.

Also Read: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. తెలుగు నటి హేమ పేరు రావడంపై మంచు విష్ణు కీలక కామెంట్స్