పుట్టిల్లు చైనాను దాటేసింది : లాక్ డౌన్ చేసినా కంట్రోల్ అవని కరోనా…స్పెయిన్ లో ఒక్కరోజే 738మంది మృతి

కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చాలా దేశాలు పూర్తిస్థాయి లాక్ డాన్ ప్రకటించేశాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికి వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. స్పెయిన్ లో అయితే పరిస్థితులు మరింత భీతావహంగా ఉన్నాయి. స్పెయిన్ లో కరోనా వైరస్ మరణాల సంఖ్య కరోనా పుట్టిల్లు చైనాను దాటిపోయింది.
చైనాలో ఇప్పటివరకు 3,285 మంది మృతి చెందగా, స్పెయిన్‌లో ఈ సంఖ్య 3,434గా ఉంది. నిన్న ఒక్కరోజే 738మంది మరణించినట్లు అక్కడి పత్రికలు రిపోర్ట్ చేశాయి. స్పెయిన్ లో 48వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. మార్చి-15,2020 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఫుడ్,మెడిసిన్ ల వంటి కనీస అవసరాలకు తప్పితే ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
కరోనాపై యుద్ధంలో భాగంగా స్పెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ను జాతీయం చేసేసింది. అంతేకాకుండా దేశంలోని నాలుగో ఏడాది చదువుతున్న మెడికల్ విద్యార్థులందరినీ స్పెయిన్ హెల్త్ సర్పీస్ కు సాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది.
కాగా, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20వేల మంది మరణించగా, 4లక్షల 40వేల మంది వైరస్ బారిన పడ్డారు. 6వేల 820 కరోనా మరణాలతో ఇటలీ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇటలీలో దాదాపు 70వేలమందికి కరోనా సోకింది.