కరోనా వైరస్ : 3 వేల మంది బలి..80 వేల మందికి చికిత్స

చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక ఈ ప్రాణాంతక వైరస్.. చైనాతో పాటు 90 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారినపడి మరణించిన వారిలో చైనా తర్వాత అత్యధికంగా ఇటలీ ఉంది.
6 ఖండాల్లో కరోనా..
దక్షిణ కొరియాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అంటార్కిటికా మినహా మిగితా 6 ఖండాల్లో కరోనా వ్యాపించింది. ఇక ఇరాన్, అమెరికా, ఫాన్స్, జపాన్‌లోనూ మృతుల సంఖ్య భారీగానే నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ 3వేల 436 మందికి పైగా మృతి చెందారు. ఇక కరోనా వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటి వరకూ 56 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాపై అన్ని ప్రభుత్వాలూ సమర్థ వంతమైన చర్యలు తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పిలుపునిచ్చింది.
భారత్‌లో..
కరోనా భారత్‌లో కూడా విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. ఢిల్లీలో మరో కేసు నమోదుకావడంతో ఈ కేసుల సంఖ్య 31కి చేరింది. ఢిల్లీకి చెందిన ఓవ్యక్తి ఈమధ్యే థాయిలాండ్, మలేషియా దేశాల్లో పర్యటించి వచ్చాడు. తాజాగా అతడు అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్య అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో..
దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా భయపెడుతోంది.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒకే ఒక్క కరోనా రోగి ఉన్నాడు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ.. వైద్య బృందం కేరళలో పర్యటించనున్నారు. కేరలాలో ఇటీవల కరోనా సోకిన వారికి ఎలాంటి వైద్యం అందించి.. వ్యాధిని తగ్గించారన్న సమాచారాన్ని అధికారులు తెలుసుకోనున్నారు. (కరోనా ఉంది..స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయ్యండి – టీడీపీ)
Read More : తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?