Brazil Mudslides : బ్రెజిల్‌లో వరదల బీభత్సం.. 78కి చేరిన మృతుల సంఖ్య
బ్రెజిల్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పర్వత ప్రాంతమైన రియో డి జనీరో రాష్ట్రంలో కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ వరదల్లో చిక్కుకుని మృతిచెందినవారి సంఖ్య 78కి చేరింది.

Death Toll Rises To 78 From Mudslides After Storm In Brazil (1)
Brazil Mudslides : బ్రెజిల్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పర్వత ప్రాంతమైన రియో డి జనీరో రాష్ట్రంలో కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌లోని పెట్రోపోలీస్ (Petropolis) నగరంలోని వీధులు నదులను తలపిస్తున్నాయి. ఈ వరదల్లో చిక్కుకుని మృతిచెందినవారి సంఖ్య 78కి చేరింది. వరదనీటి ధాటికి చాలావరకు ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావం వల్ల రియో డి జనీరోకు ఉత్తరాన ఉన్న హిల్స్‌లోని పెట్రోపోలీస్ నగరంపై వరదనీరు పోటెత్తింది. ఈ వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్ల సాయంతో బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.
వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి ఆహారం, నీళ్లు, దుస్తులు, ఫేస్ మాస్కులు అందిస్తున్నారు. భారీగా ప్రవహిస్తన్న వరదనీటిలో కార్లు, చెట్లు కొట్టుకుపోయాయి. పెట్రోపోలిస్ నగరంలో కేవలం 3 గంటల్లో 258 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మేయర్ ఆఫీసు ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబరు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ అతలాకుతలమైంది. గత నెలలో కుండపోత వర్షం, భారీ వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆగ్నేయ బ్రెజిల్‌లో 28 మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుందని గవర్నర్ క్లాడియో కాస్ట్రో తెలిపారు. పెట్రోపోలిస్ నగరంలో మంగళవారం భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు 400 మంది నివాసులు నిరాశ్రయులయ్యారని క్యాస్ట్రో చెప్పారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసినట్టు గవర్నర్ కాస్ట్రో తెలిపారు. మరో 21 మందిని సురక్షితంగా వెలికితీసినట్టు చెప్పారు. బురదతో కూడిన వరదనీటిలో చిక్కుకున్న అనేకమంది సాయం కోసం గట్టిగా కేకలు వేశారని, కానీ, వారిని కాపాడుకోలేకపోయానని రోసిలీన్ వర్జిలియో (49) అనే మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. పెట్రోపోలిస్ అనేది ఒక మాజీ బ్రెజిలియన్ చక్రవర్తి పేరు. జర్మన్-ప్రభావిత సముద్రతీర మహానగరానికి ఎగువన ఉన్న పర్వతాలలో ఉంది. దాదాపు రెండు శతాబ్దాలుగా పర్యాటకులకు ఆశ్రయంగా మారింది.
రానురాను ఈ పర్వత ప్రాంతం దెబ్బతినడంతో ఇటీవలి దశాబ్దాలలో భారీ విపత్తులను ఎదుర్కంటోంది. ఇప్పటివరకూ సంభవించిన విపత్తుల్లో 900 మంది కంటే ఎక్కువ మంది మరణించారు. ఈ పర్వత ప్రాంతమైన పెట్రోపోలిస్ నగరంలో తరచూ కొండచరియలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదాలను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం ఒక ప్రణాళికను చేపట్టినట్టు గవర్నర్ తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా భారీ వర్షాలు కురిశాయని పెట్రోపోలిస్ సివిల్ డిఫెన్స్ అథారిటీ తెలిపింది. గత 30 రోజులలో కంటే అత్యధిక స్థాయిలో భారీగా వర్షాలు కురిశాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పెట్రోపోలిస్ సివిల్ డిఫెన్స్ అథారిటీ తెలిపింది.
Read Also : Brazil: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి