Nawaz Sharif: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి దౌత్య మార్గమే ఉత్తమం- పాక్ ప్రధానికి మాజీ ప్రధాని కీలక సూచన

ఈ ఘటన తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు..

Nawaz Sharif: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి దౌత్య మార్గమే ఉత్తమం- పాక్ ప్రధానికి మాజీ ప్రధాని కీలక సూచన

Updated On : May 2, 2025 / 8:13 PM IST

Nawaz Sharif: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత ఆర్మీ స్థావరాలపై కాల్పులు జరుపుతు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా భారత ఆర్మీ దాడికి దిగొచ్చని పాక్ వణికిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కీలక సూచన చేశారు.

భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించడమే ఉత్తమం అని తన సోదరుడు, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు నవాజ్ షరీఫ్ సూచించినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నవాజ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ సలహా ఇచ్చినట్లు సమాచారం.

మూడుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ (75) పాలక పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధిపతి. ఆయన తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కాగా, ఆయన కుమార్తె మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి. నవాజ్ కానీ, మరియం కానీ ఇంతవరకు పహల్గాం ఉగ్రదాడిని ఖండించింది లేదు.

Also Read: భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు..

“రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగినవి. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య మార్గాన్ని ఉపయోగించుకోవాలి” అని నవాజ్ షరీఫ్ ప్రధాని షెహబాజ్‌తో అన్నట్లు సమాచారం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించి, చర్చల ద్వారానే ముందుకు వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశం తీసుకున్న నిర్ణయాలను నవాజ్‌కు వివరించారు ప్రధాని షెహబాజ్ షరీఫ్. జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతంలో యుద్ధ ప్రమాదాన్ని పెంచిందని షెహబాజ్ అన్నారు.

Also Read: భారత్‌ లక్ష్యంగా ఎల్‌వోసీ వెంట పాక్ ఆర్మీ బ్రిగేడ్ల మోహరింపు.. ఉగ్రవాదులతో ఈ బ్రిగేడ్లు ఏం చేయిస్తాయో.. వాటి చరిత్ర ఏంటో తెలుసా?

ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది టూరిస్టులే ఉన్నారు. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటన తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని నిర్ణయించడంతో పాటు పాకిస్తాన్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు బదులుగా.. సిమ్లా ఒప్పందంతో సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడమే కాకుండా, భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది.