భారత్ లక్ష్యంగా ఎల్‌వోసీ వెంట పాక్ ఆర్మీ బ్రిగేడ్ల మోహరింపు.. ఉగ్రవాదులతో ఈ బ్రిగేడ్లు ఏం చేయిస్తాయో.. వాటి చరిత్ర ఏంటో తెలుసా?
ఈ బ్రిగేడ్ సైన్యానికి బదులుగా ఉగ్రవాదులను వాడుతూ దాడులు చేయిస్తుంటుంది.

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట పాకిస్థాన్ ఆర్మీ పెద్ద సంఖ్యలో బ్రిగేడ్లను మోహరించింది. ఈ ఆర్మీ యూనిట్లు పాక్ సైన్యం కోసం మాత్రమే కాకుండా లష్కరే, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపుల కోసం కూడా పనిచేస్తున్నాయని భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.
పాకిస్థాన్ మోహరించిన ఆర్మీ యూనిట్లలో 111 పదాతిదళ బ్రిగేడ్‌తో పాటు 212 పదాతిదళ బ్రిగేడ్ ఉంది. 111 పదాతిదళ బ్రిగేడ్ తిరుగుబాటు దాడులు చేయడంలో ఆరి తేరింది. అలాగే, 212 పదాతిదళ బ్రిగేడ్ పరోక్ష యుద్ధం చేయడంలో దిట్ట. అంటే ఈ బ్రిగేడ్ సైన్యానికి బదులుగా ఉగ్రవాదులను వాడుతూ దాడులు చేయిస్తుంటుంది.
తిరుగుబాట్లు, పరోక్ష యుద్ధం చేయించడంలో పేరు మోసిన బ్రిగేడ్లను పాక్ ఎల్‌వోసీ వద్ద మోహరించినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ బ్రిగేడ్లు ఉగ్రవాద గ్రూపులతో కలిసి పనిచేస్తాయి. ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించడం వంటి చర్యలకు పాల్పడడానికి ఈ బ్రిడేడ్లు పనిచేస్తాయి.
సురక్షితమైన మార్గాల ద్వారా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడం, వారికి ఆయుధాలు ఇవ్వడం వంటి పనులు చేస్తుంటాయి. భారతీయ దళాలపై ఉగ్రవాదులతో కాల్పులు జరిపించడం, భారత సైన్య దృష్టిని మళ్లించడం వంటి చర్యలకు సాయం చేస్తాయి.
ఈ పనుల ద్వారా ఉగ్రవాదులు సరిహద్దు మీదుగా భారత్‌లోకి చొరబడేలా చేస్తుంటాయి. అటువంటి బ్రిగేడ్లను పాక్ ఎల్‌వోసీ వద్ద మోహరించింది. ఈ బ్రిగేడ్లను పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు.
పాకిస్థాన్ మోహరించిన ఈ బ్రిగేడ్లు శత్రువుల శరీర భాగాలను కోసేయడం, శిరచ్ఛేదం, డ్రోన్లతో ఆయుధాలను జారవిడచడం వంటి చర్యలకు కూడా పాల్పడుతుంటాయి.
పాక్‌లో ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర
ఎల్‌వోసీ వద్ద కెరాన్, మాచిల్, తంగ్ధర్‌లో పాకిస్థాన్ 111 బ్రిగేడ్‌ను మోహరించింది. ఈ బ్రిగేడ్ పాక్‌లో ప్రభుత్వాలను పడగొట్టడంలో కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉంది. పాకిస్థాన్ చరిత్రలో మూడుసార్లు ఆ దేశ సైన్యం ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకోవడంలో 111 బ్రిగేడ్ సహాయపడింది.
పాకిస్థాన్‌లో 1958లో జనరల్ అయూబ్ ఖాన్, 1977లో జనరల్ జియా-ఉల్-హక్, 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ వాటికి నాయకత్వం వహించారు. 111 బ్రిగేడ్ పాక్‌లోని ముఖ్యమైన భవనాలను చుట్టుముట్టడం, కీలక నాయకులను అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడడంలో కీలక పాత్ర పోషించింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. 2019 పుల్వామా, 2025 పహల్గాంలో దాడులకు బాధ్యత వహించాల్సింది ఈ బ్రిగేడే. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ ఇప్పుడు పాక్ ఈ బిగ్రేడ్లను వాడుకుంటోంది.