Cash For Mosquitoes : ఇదెక్కడి స్కీమ్ రా నాయనా.. దోమలు పట్టిస్తే డబ్బులు.. ఎక్కడో, ఎందుకో తెలుసా..
దోమలు పట్టుకుని తీసుకురండి. బతికున్నా, చనిపోయినా పర్వాలేదు. ఐదు దోమలు తెచ్చి ఇస్తే..

Cash For Mosquitoes : అవును.. ఇది నిజమే.. దోమలు పట్టిస్తే డబ్బులు ఇస్తారు. ఐదు దోమలు తెస్తే.. రూపాయిన్నర ఇస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డెడ్ ఆర్ అలైవ్.. అంటే బతికున్నా లేదా చనిపోయినా పర్లేదు.. దోమలు తెచ్చి ఇస్తే చాలు.. డబ్బులు ఇస్తారు. ఇదెక్కడి విడ్డూరం రా నాయనా అని షాక్ అవుతున్నారు కదూ.
ఈ చిత్ర విచిత్రమైన ఆఫర్ ఫిలిప్పైన్స్ దేశంలో ఇచ్చారు. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా నగరానికి సమీపంలో మండలుయోంగ్ సిటీలో ఉన్న అడిషన్ హిల్స్ లో ఈ ఆఫర్ ఇచ్చారు. దోమలు తెచ్చి ఇస్తే డబ్బులు ఇవ్వడం ఏంటి అనే సందేహం కలగొచ్చు. దాని వెనుక బలమైన కారణమే ఉంది. ఈ మధ్య కాలంలో అక్కడ దోమల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దోమకాటుతో డెంగీ, ఇతర అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి.
వేల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ కారణంగా మరణాలూ సంభవిస్తున్నాయి. దాంతో అడిషన్ హిల్స్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దోమల దెబ్బకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలో దోమలను అరికట్టే ప్రణాళికలో భాగంగా స్థానిక నాయకుడు కార్లిటో సెర్నాల్ వినూత్నమైన ఆలోచన చేశాడు. అదే.. దోమలు తెచ్చిస్తే డబ్బులు ఇవ్వడం. దోమలు పట్టుకుని తీసుకురండి. బతికున్నా, చనిపోయినా పర్వాలేదు. ఐదు దోమలు తెచ్చి ఇస్తే.. ఒక ఫిలిప్పైన్స్ పెసో (భారత కరెన్సీలో రూపాయిన్నర) ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు అతడు.
Also Read : ఘరానా మోసం.. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ వచ్చిందా? మాట్లాడారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడం ఖాయం..!
ఆ దేశ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఫిబ్రవరి 1 నాటికి ఫిలిప్పీన్స్‌లో కనీసం 28వేల 234 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ఒక్క క్యూజోన్ నగరంలోనే, ఈ సంవత్సరం నమోదైన 1,769 డెంగీ కేసులలో 10 మంది చనిపోయారు. వారిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. లక్ష మంది కంటే ఎక్కువ జనాభా కలిగున్న అడిషన్ హిల్స్ లో.. డెంగీని అరికట్టడానికి ఇప్పటికే క్లీన్-అప్ డ్రైవ్‌లు, కెనాల్ డి-క్లాగింగ్ చేస్తున్నారు. పరిశుభ్రత క్యాంపెయిన్ లు నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం డెంగీ కేసులు 42కి పెరిగాయి. ఇద్దరు విద్యార్థులు డెంగీతో చనిపోయారు. దాంతో గ్రామ నాయకుడు కార్లిటో సెర్నాల్ దోమల అంతు చూడాల్సిందేనని నిర్ణయించారు. ఈ పథకం కింద గ్రామస్తులు ఐదు దోమలు లేదా దోమల లార్వాను తెస్తే ఒక ఫిలిప్పైన్ పెసోను ఇస్తారు.
కాగా, ఈ స్కీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నగదు కోసం ప్రజలు దోమలను పెంచడం ప్రారంభిస్తే మరిన్ని దారుణాలు జరిగిపోవడం ఖాయం అంటున్నారు. ఈ స్కీమ్ గురించి తెలియగానే స్థానికులు పనిలోకి దిగిపోయారు. దోమలను వేటాడారు. చంపిన, బతికున్న దోమలు తీసుకుని గ్రామ కార్యాలయం వద్ద బారులు తీరారు. దోమలను చూపించి డబ్బులు తీసుకెళ్లడానికి వారంతా వచ్చారు.
డెంగీ అనేది ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్. కీళ్ల నొప్పులు, వికారం, దద్దుర్లు, తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తస్రావం, అవయవ వైఫల్యం వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, ద్రవ స్థాయిలను నిర్వహించడానికి ముందస్తు వైద్య సంరక్షణ చాలా ముఖ్యమైనది.