Donald Trump: అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ సంతకంకోసం సిద్ధమైన పది కీలక అంశాల ఫైళ్లు ఇవే..
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టిన వెంటనే ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారు.

Donald Trump
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టిన వెంటనే ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారు. పలు ఆదేశాలు ఆయన సంతకం కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ రాబోయే కొద్దిరోజుల్లోనే 200కిపైగా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. వాటిలో ముఖ్యంగా అమెరికా పౌరులు కాని వారికి ఆ గడ్డపై పుట్టే పిల్లలకు సహజంగా వచ్చే పౌరసత్వం రద్దు, అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు, చమురు, సహజవాయు ఉత్పత్తిపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ట్రంప్ భావిస్తున్నారట. అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లోనూ కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: PM Modi : నా ప్రియమైన మిత్రమా.. అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ అభినందనలు.. మళ్లీ కలిసి పనిచేద్దాం..!
అమెరికాలో అక్రమ వలసలను అరికడతామని, అందుకోసం కఠిన విధానాలు అమలు చేస్తామని ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ట్రంప్ తన ప్రసంగంలో మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని వలసలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ‘‘రిమైన్ ఇన్ మెక్సికో’’ విధానాన్ని మళ్లీ అమలు చేస్తామని, దక్షిణ సరిహద్దు వద్ద భద్రతను పెంచేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని ట్రంప్ చెప్పారు.
చమురు, సహజవాయు ఉత్పత్తిపై ఉన్న బంధనాల్ని ట్రంప్ సడలించనున్నారు. అమెరికా స్వయం సమృద్ధి సాధించడానికి, అమెరికన్ పౌరులకు ఇంధన ఖర్చులను తగ్గించడానికి ‘జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి’ని ప్రకటించబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దేశీయ చమురు ఉత్పత్తిని పెంచడం, వినియోగదారులకోసం సహజవాయు ధరలను తగ్గించడం ద్వారా అమెరికాను శక్తి- ఆధారితంగా మారుస్తామని ట్రంప్ తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని తగ్గించబోమని, అమెరికా ప్రజలు వారికి కావాల్సిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించామని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మానుఫ్యాక్చరింగ్ దేశంగా అమెరికా అవతరిస్తుంది.
కొవిడ్ -19 వ్యాక్సిన్ పొందడానికి నిరాకరించినందుకు విధుల నుండి తొలగించబడిన వేలాది మంది యూఎస్ సైనికులను తిరిగి చేర్చుకుంటానని ట్రంప్ ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే ఈ అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు.
అమెరికా పౌరులు ప్రయోజనం పొందేలా ఇతర దేశాలపై పన్నులు, సుంకాలు విధిస్తామని ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. వాణిజ్య వ్యవస్థను సంస్కరించడానికి, ఎక్స్‌టర్నల్ రెవిన్యూ సర్వీస్ ని స్థాపించే ప్రణాళికలను కూడా వెల్లడించారు. సుంకాలు, కస్టమ్స్, ఆదాయాన్ని సేకరించే ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీస్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇది విదేశీ వనరుల నుంచి అమెరికా ఖజానాకు గణనీయమైన నిధులను తెస్తుందని ట్రంప్ తెలిపారు.
ప్రభుత్వ సెన్సార్‌షిప్‌లను రద్దు చేస్తామని, అమెరికాలో వాక్ స్వేచ్ఛను పునరుద్దరిస్తామని ట్రంప్ అన్నారు.
అమెరికాలో స్త్రీ, పురుష లింగాలను మాత్రమే గుర్తించాలని తప్పనిసరి చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని ట్రంప్ ప్రకటించారు.
పనామా కెనాల్ ను మళ్లీ తమ ఆదీనంలోకి తీసుకోవాలని అమెరికా యోచిస్తోందని ట్రంప్ అన్నారు.
ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలలో జన్మహక్కు పౌరసత్వానికి స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు అయితే పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది.
ప్రపంచ దిగుమతులపై 10శాతం సుంకం, చైనా వస్తువులపై 60శాతం సుంకం, కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ చర్యలు యూఎస్ ఆర్థిక వృద్ధిని పెంచుతాయని ట్రంప్ చెప్పారు.