కరోనా సోకి ఇటలీలో 5గురు మృతి…దేశవ్యాప్తంగా నిషేదాజ్ణలు

యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడు లీ లండీ ప్రాంతానికి చెందిన 88ఏళ్ల వృద్ధుడు అని అధికారులు తెలిపారు.
ఇటలీలో ఇప్పటివరకు 219మంది వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. అయితే ఇందులో 100మందికి పైగా ఉత్తర ఇటలీలోని లొంబార్డీ ప్రాంతానికి చెందినవారే. వైరస్ సోకిన అందరినీ,హాస్పిటల్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వైరస్ లక్షణాలతో కన్పించిన మరికొందరిని కూడా హాస్పిటల్ లోనే ఉంచారు.
కరోనా భయంతో ఇటలీలో నిషేదాజ్ణలు విధించారు అక్కడి అధికారులు. దాదాపు 10పట్టణాల్లో 50వేలమంది ప్రజలను ఇళ్ల నుంచి బయటకి రాకూడదని ఆంక్షలు విధించారు. ప్రత్యేకమైన పర్మిషన్ తోనే ఆ సిటీల్లోని ప్రజలు బయటికి వెళ్లడం కానీ,బయటివ్యక్తులు ఆ సిటీల్లోకి ప్రవేశించడం కానీ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆ 10 పట్టణాలకు ప్రవేశ ద్వారాలను పర్యవేక్షించడానికి పోలీసులు మరియు సైనిక దళాలను నియమించారు. పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. వెనిస్ కార్నివాల్ యొక్క చివరి రెండు రోజులతో పాటు వాణిజ్య ఉత్సవాలు, ఒపెరా ప్రదర్శనలు మరియు సాకర్ మ్యాచ్‌లను ఇటలీ అధికారులు రద్దు చేశారు.
మరోవైపు నిషేదాజ్ణల లిస్ట్ లో లేకపోయినప్పటికీ, ఈ వైరస్ దేశానికి ఆర్థిక ఇంజిన్ అయిన మిలాన్ కూడా ప్రభావితం చేస్తుంది. మిలాన్‌లో స్టాక్ మార్కెట్ సోమవారం 4 శాతానికి పైగా పడిపోయింది. నగరంలోని ప్రఖ్యాత కేథడ్రల్‌తో సహా అనేక పర్యాటక ఆకర్షణలు మూసివేయబడ్డాయి. కాలేజీలు మూసివేయబడ్డాయి.
ఉత్తర ఇటలీ నుంచి వచ్చే ప్రజలపై దక్షిణ ఇటలీలోని బాసిలికాటా 14 రోజుల నిర్బంధాన్ని విధించింది. రాజధాని రోమ్ నుండి ఆఫ్రికా ద్వీపం మారిషస్ కు అలిటాలియా విమానంలో వెళ్లిన ప్రయాణీకులకు దిగ్బంధం లేదా వెంటనే తిరిగి రావడానికి ఛాయిస్ ఇచ్చింది. ప్రయాణీకులలో ఎవరూ కరోనావైరస్ యొక్క లక్షణాలను ప్రదర్శించలేదని, కానీ ఇటలీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అలిటాలియా తెలిపింది. మరోవైపు కరోనా భయంతో చాలామంది విదేశీయులు కూడా తమ ఇటలీ పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు. ప్రభుత్వం చాలా ఎక్కువ జాగ్రత్తలు కొనసాగిస్తోందని,ప్రతిదీ నియంత్రణలో ఉందని ఇటాలియన్ ప్రధాన మంత్రి గియుసేప్ కాంటే తెలిపారు. యూరప్ లో మొదటి కరోనా మరణం ఫ్రాన్స్ లో నమోదైన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా 2వేల 600మంది ప్రాణాలు కోల్పోగా,అందులో 2వేల 500మందికి పైగా చైనాలోనే ప్రాణాలు కోల్పోయారు. చైనాలో 70వేలమందికి పైగా వైరస్ సోకినట్లు నిర్థారణ అయి హాస్పిటల్ లో ఉన్నారు. తొమ్మిది మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా కరోనా సోకింది. ఇరాక్,కువైట్,బహ్రెయిన్,ఆఫ్గనిస్తాన్,ఒమన్,టర్కీ దేశాలతో పాటుగా దక్షిణ కొరియాలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి.