NYC Cathedral వద్ద తుపాకీతో వీరంగం, పోలీసుల కాల్పుల్లో మృతి

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 01:35 PM IST
NYC Cathedral వద్ద తుపాకీతో వీరంగం, పోలీసుల కాల్పుల్లో మృతి

Updated On : December 14, 2020 / 2:24 PM IST

NYC Cathedral Christmas : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ గర్జించింది. ఆర్థిక రాజధాని న్యూయార్క్.. కాల్పుల మోతతో మారుమోగిపోయింది. క్యాథడ్రల్ చర్చ్ దగ్గర ఏర్పాటు చేసిన ఓ మ్యూజికల్ కన్సర్ట్‌పై గుర్తు తెలియని వ్యక్తి .. తుపాకీతో వీరంగం సృష్టించాడు. యథేచ్ఛగా గాలిలో కాల్పులు జరిపాడు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. క్రిస్మస్ వేడుకలు కొనసాగుతోన్న పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్‌లోని హర్లెమ్ ప్రాంతంలోని సెయింట్ జాన్స్ సిటీ క్యాథడ్రల్ చర్చి దగ్గర ఈ ఘటన జరిగింది. క్రిస్మస్ సమీపిస్తోన్న సందర్భంగా చర్చి బయట మ్యూజికల్ కన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 200 మందికి పైగా ఈ వేడుకలకు హాజరయ్యారు.

భుజానికి బ్యాక్‌ప్యాక్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చర్చి వద్దకు చేరుకున్నాడు. కొద్దిసేపటి తరువాత.. వెంట తెచ్చుకున్న తుపాకీతో గాలిలో కాల్పులు జరిపాడు. ఈ కన్సర్ట్‌కు హాజరైన వారిపైనా తుపాకీని ఎక్కు పెట్టాడు. వారిని భయపెడుతూ 20 సార్లు గాలిలో కాల్పలు జరిపాడు. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతన్ని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. కానీ దీనికి అతడు నిరాకరించాడు. పోలీసులపైనా కాల్పులు జరిపాడు.

దీంతో వారు ఎదురు కాల్పులు జరపగా..దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయాడు. దాదాపు 15 నిమిషాల పాటు అతను చర్చి ఆవరణలో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో తేలింది. ఆగంతకుడు ధరించిన కోవిడ్ మాస్క్.. డొమినిక్ రిపబ్లిక్ జాతీయ పతాకంతో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.