పశ్చిమాసియాలో టెన్షన్ టెన్షన్..! ఇజ్రాయెల్‌ను తుడిచి పెట్టేస్తామని ఇరాన్ వార్నింగ్..!
ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడివరకు విస్తరిస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Iran Israel War Tensions (Photo Credit : Google)
Iran Israel War : పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్ ను తుడిచి పెట్టేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమర్థించుకుంటున్నారు. మొన్న జరిపిన దాడి శాంపిల్ మాత్రమే అని, అసలు దాడి ముందుందని ఇరాన్ సుప్రీం హెచ్చరిస్తున్నారు. ఇరాన్ తో పాటు ఇరాక్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్ కూడా ఇజ్రాయెల్ శత్రువే అని ఇరాన్ సుప్రీం లీడర్ అంటున్నారు. అందరం కలిసి ఇజ్రాయెల్ ను ఖతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యావత్ ప్రపంచం పశ్చిమాసియా వైపు ఊపిరిబిగబట్టి చూస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ వెంటాడుతోంది.
ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడివరకు విస్తరిస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ దెబ్బకు దెబ్బ తీస్తామని శపధం చేస్తోంది. ఇరాన్ భయంకరమైన తప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఆ దేశ రాయబారి అంటున్నారు. వ్యూహాత్మకంగా ఇరాన్ పై విరుచుకుపడటం ఖాయమంటున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది.
Also Read : ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..
ముఖ్యంగా అణు స్థావరాలతో పాటు దేశ ఆర్థిక మూలాలైన చమురు, సహజ వాయువు క్షేత్రాలను పేల్చేయాలని బిగ్ స్కెచ్ వేసింది. విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని మరో ప్లాన్ వేసుకున్నారు. మరి ఇదే జరిగితే..ఆ దేశ ప్రజల పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఏం జరగనుంది? అనేది ఊహించుకుంటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే యూఎస్ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సన్నగిల్లింది. ఇక ఇజ్రాయెల్ అన్నంత పని చేస్తే ఇరాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ అండగా ఉంటుందన్నారు. మీరు త్వరలో విముక్తి పొందుతారని ప్రకటించారు. అంటే ఇరాన్ లో పాలన మార్పును సూచించే విధంగా ఇజ్రాయెల్ ప్రధాని కామెంట్స్ చేశారు.