Viral Video: సముద్రంలో యువకుడిని మింగేసిన తిమింగలం.. అయినా ఎలా బయటపడ్డాడో చూడండి..
పడవతో పాటు ఆడ్రియన్ తిమింగలం నోటిలోకి ఇలా వెళ్లిపోయాడు.

ఛత్రపతి సినిమాలో ప్రభాస్‌పై తిమింగలం దాడి చేస్తుంది. అయితే, దాని పొగరును అణిచి మరీ ప్రభాస్ పడవ మీదకు వచ్చేస్తాడు. నిజజీవితంలో మాత్రం తిమింగలం బారినపడితే బతికి మళ్లీ బట్టకట్టడం సాధ్యమేనా? తిమింగలం మింగేసిన వ్యక్తి మళ్లీ బయటకు వస్తాడా? ఇది సాధ్యమైంది.
సముద్రంలో హాయిగా బోటుపై షికారు చేద్దామని వెళ్లిన ఓ యువకుడికి భయానక అనుభవం ఎదురైంది. అతడిపై తిమింగలం దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చిలీలోని పటగోనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరంలో ఆడ్రియన్ (24) తన తండ్రి డేల్‌తో కలిసి కయాక్‌లో విహరిస్తున్నాడు. కయాక్ అంటే ఒక చిన్న పడవలాంటిది.
ఇది డబుల్ బ్లేడెడ్ తెడ్డుతో ముందుకు వెళ్తుంది. అందులో ప్రయాణించేవారిని కయాకర్ అంటారు. ఆడ్రియన్‌కు కయాకర్‌గా సముద్రంలో విహరించడం అంటే ఇష్టం. ఇదే సరదా అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.
అతడి పడవపై భారీ తిమింగలం దాడి చేసింది. నోటిని తెరచి పడవతో సహా ఆడ్రియన్‌ను మింగేయబోయింది. పడవతో పాటు ఆడ్రియన్ తిమింగళం నోటిలోకి వెళ్లిపోయాడు. కుమారుడిని తిమింగలం మింగేయడం డేల్ విస్మయానికి గురయ్యారు.
అంతలోనే తిమింగలం ఆడ్రియన్‌ను బయటకు ఉమ్మి వేసింది. బోటుతో పాటు అతడు నీటిపైకి రావడంతో తండ్రి డేల్ ఊపిరి పీల్చుకున్నాడు. కుమారుడికి ధైర్యం చెప్పి, అతడిని ఒడ్డుకు చేర్చాడు. తండ్రీకొడుకులు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
వారి వీడియోను ఒకరు తీయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లక్షలాది వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది. ఆ తండ్రీకొడుకులకు భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram