MiG-21: ‘మిగ్-21’ శకం ముగిసింది.. వీడ్కోలు పలికిన వాయుసేన.. రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే..

MiG-21: భారత వాయుసేన (ఐఏఎఫ్) లో ఓ చారిత్రక అధ్యయనానికి తెరపడింది. మిగ్-21 ఫైటర్ జెట్ సేవలకు వాయుసేన వీడ్కోలు పలికింది.

MiG-21: ‘మిగ్-21’ శకం ముగిసింది.. వీడ్కోలు పలికిన వాయుసేన.. రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే..

MIG 21 fighter Jet

Updated On : September 26, 2025 / 2:45 PM IST

MiG-21: భారత వాయుసేన (ఐఏఎఫ్) లో ఓ చారిత్రక అధ్యయనానికి తెరపడింది. ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతల రక్షణకు వెన్నుదన్నుగా నిలిచిన మిగ్-21 ఫైటర్ జెట్ సేవలకు వాయుసేన వీడ్కోలు పలికింది.

మిగ్‌-21 యుద్ధ విమానం 1963లో తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టింది. ఆ తరువాత.. 1971 నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు వాయుసేనలో సేవలు అందిస్తూ.. ఎన్నో యుద్ధాల్లో విజయాన్నిఅందించిన మిగ్ -21 ఫైటర్ జెట్‌కు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వీడ్కోలు పలికారు. శుక్రవారం చండీగఢ్ వాయు సేన కేంద్రం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఐఏఎఫ్ సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు. ఈ చివరి ప్రయాణానికి గుర్తుగా మిగ్‌లకు వాటర్ సెల్యూట్ చేశారు. తరువాత వాటికి సంబంధించిన లాగ్‌బుక్‌ను రాజ్‌నాథ్ సింగ్‌కు ఎయిర్ చీఫ్ అందజేశారు. దీంతో మిగ్ -21 శకానికి ముగింపుగా ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రత్యేక స్మారక పోస్టల్ కవర్ ను విడుదల చేశారు.


కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 1971 నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు భారత రక్షణ దళంలో మిగ్-21 ఫైటర్ జెట్‌ది కీలక పాత్ర అని అన్నారు. మిగ్-21 యుద్ధ విమానం అనేక వీరోచిత పోరాటాలకు సాక్ష్యం. 1971 యుద్ధం, కార్గిల్ వార్, బాలకోట్ వైమానిక దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అతి ముఖ్యమైన యుద్ధాలు, ఆపరేషన్లలో మిగ్ 21 నిర్ణయాత్మక పాత్ర పోషిచిందని అన్నారు.


మిగ్-21 కేవలం ఒక విమానం మాత్రమే కాదు.. ఇండియా, రష్యా మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మిగ్ 21 ఎంతో శక్తివంతమైంది. ఇండియాకు రక్షణ కవచంగా నిలిచిందని కొనియాడారు. తరతరాలుగా వైమానిక యోధులకు మిగ్ 21 స్ఫూర్తినిచ్చిందని అన్నారు.


మిగ్ 21 యుద్ధ విమానాన్ని రష్యా తయారు చేసింది. 1962లో మిగ్ 21 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియా మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం ఇదే. ఆరు దశాబ్దాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎కు వెన్నుముకలా నిలిచింది ఈ ఫైటర్ జెట్. వేగం, చురుకుదనానికి ప్రసిద్ధి చెందిన మిగ్ 21 ఇండియన్ ఆర్మీ చేపట్టిన యుద్ధాలు, ఎన్నో ఆపరేషన్లలో క్రియాశీలక పాత్ర పోషించింది. అయితే.. తేజస్ వంటి ఆధునిక స్వదేశీ విమానాలు ఫీల్డ్‎లోకి రావడంతో మిగ్ 21 సేవలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముగింపు పలికింది.