ఎట్టకేలకు ఇమ్రాన్‌ను కలిసిన ఆయన సోదరి.. సంచలన కామెంట్స్
మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా తెలిపారు. కానీ, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను కలిసేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా అధికారులు కొన్ని వారాల పాటు నియంత్రించిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు ఇమ్రాన్‌ను కలిసేందుకు ఉజ్మాకు అధికారులు అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం ఆయనను ఆమె జైలులో కలిసి, 20 నిమిషాల పాటు మాట్లాడారు.
Also Read: Actress Hema : ఆ సమయంలో చిరంజీవి గారి సపోర్ట్.. వాళ్ళ మనిషిని పంపించి.. ఆ హీరో దగ్గర ఏడ్చేశాను..
అనంతరం ఉజ్మా మీడియాతో మాట్లాడుతూ.. “ఆయన బాగున్నారు… కానీ తాను మానసికంగా వేధింపులకు గురవుతున్నానని కోపంగా అన్నారు. రోజంతా సెల్లోనే ఉంచుతున్నారు. కొద్ది సమయం మాత్రమే బయట నిలబడే అవకాశం ఇస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడే వీలు లేకుండా చేస్తున్నారు” అని అన్నారు.
మొత్తం సైన్యాన్ని తన నియంత్రణలోకి తీసుకుని, తాను, ఇతర సేవాధిపతులు, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి జీవితాంతం జైలు శిక్షల నుంచి మినహాయింపు పొందేలా రాజ్యాంగాన్ని మార్చుకున్న జనరల్ అసీం మునీర్ తీరును ఖాన్ తప్పుబట్టారని ఆమె తెలిపారు. తన నిర్బంధానికి అసీం కారణమని అన్నారని చెప్పారు.
కాగా, అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ప్రచారం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ అక్కాచెల్లెళ్లు నూరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలు వద్ద ఇటీవల నిరసన తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలవనివ్వాలని ఆ ముగ్గురు మహిళలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు తమపై దాడి చేశారని అన్నారు.
