Israel-Gaza Violence: గాజా వివాదంపై ఓటింగ్ కు భారత్ దూరం
ఇటీవల11 రోజుల పాటు ఇజ్రాయెల్- గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.

India Abstains From Voting On Unhrc Resolution To Probe Alleged Crimes During Gaza Conflict
Israel-Gaza Violence ఇటీవల11 రోజుల పాటు ఇజ్రాయెల్- గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాదులు కొన్ని వేల సంఖ్యలో రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేశారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సేనలు దాడికి పాల్పడ్డాయి. రాకెట్లు, యుద్ధ విమానాలతో గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన హింసలో దాదాపు 200 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందగా..వందల మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇజ్రాయెల్ వైపు కూడా ప్రాణనష్టం జరిగింది.
అయితే గత వారం పరస్పర శాంతి ఒప్పందంతో ఘర్షణ సద్దుమనిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలస్తీనా, తూర్పు జెరూసలెం, ఇజ్రాయెల్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై దర్యాప్తు జరిపేందుకు 47 సభ్య దేశాల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(UNHRC)గురువారం తీర్మానం చేసింది. చైనా, రష్యా సహా 22 దేశాలు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా..9 సభ్య దేశాలు నిరాకరించాయి. అయితే ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ సహా 13 దేశాలు దూరంగా నిలిచాయి.
ఇక, ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము తీవ్రస్థాయిలో స్పందిస్తామని నెతన్యాహు తేల్చి చెప్పారు.