India China Troops : భారత్, చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చు-నివేదికలో ఆందోళనకర విషయాలు
సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.

India China Troops : వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి చైనా కొన్నేళ్లుగా ఆక్రమణలకు పాల్పడుతోంది. ఇదే విషయంపై ఇటీవల డీజీపీల సదస్సులో సమర్పించిన ఓ నివేదికలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.
ఈ నివేదికను విశ్లేషిస్తూ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని వెలువరించింది. కొన్నేళ్లుగా భారత్ చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రతాదళాల నుంచి నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాంతంలో తమ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చైనా సైన్యం మౌలిక సదుపాయాలను ముమ్మరంగా చేపడుతోంది.
కొన్నేళ్లుగా జరిగిన ఘర్షణలను, ఉద్రిక్తతలను విశ్లేషిస్తే 2013, 14 తర్వాత ప్రతీ రెండు మూడేళ్లకు వీటి తీవ్రత మరింత పెరిగింది. ఇలా ఇరు దేశాల సైనిక శక్తుల మధ్య ఘర్షణలు తరుచూ చోటు చేసుకుంటున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే తూరు లద్దాఖ్ లో చాలా గస్తీ పాయింట్లను భారత్ కోల్పోయిందని వెల్లడించింది.
Also Read..Donald Trump: నేనైతే ఒక్క రోజులోనే తేలిపోయేది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్
తూర్పు లద్దాఖ్ లో 2020లో జరిగిన ఘర్షణలో 24మంది భారత సైనికులు అమరులయ్యారు. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే, సైనిక అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరగడంతో అవి కొలిక్కి వస్తున్నట్లే అనిపించాయి. కానీ, ఇదే సమయంలో రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకోవడంతో పాటు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని తెలియడంతో అవి మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.