Anita Anand: భగవద్గీతపై చేయిపెట్టి కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్ ప్రమాణ స్వీకారం.. ఎవరీమె.. గతంలో ఏం చేశారంటే.?

భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా నూతన విదేశాంగ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Anita Anand: భగవద్గీతపై చేయిపెట్టి కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్ ప్రమాణ స్వీకారం.. ఎవరీమె.. గతంలో ఏం చేశారంటే.?

Anita Anand

Updated On : May 14, 2025 / 10:02 AM IST

Anita Anand: కెనడాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. తాజాగా.. మార్క్ కార్నీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. గతంలో కెనడా రక్షణ మంత్రిగా పనిచేసిన భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ను నూతన విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు. దీంతో ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవిత్ర హిందూ గ్రంథమైన భగవద్గీత పై చేయిపెట్టి ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన తొలి హిందూ మహిళ అనితా ఆనంద్.

 

అనితా ఆనంద్ ఎవరు?
అనితా ఆనంద్ 1967 మే 20న నోవా స్కోటియాలోని కెంట్‌విల్లేలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు. ఆమె తండ్రి తమిళ్, తల్లి పంజాబీ. 1960ల ప్రారంభంలో వారు కెనడాకు వలస వెళ్లిన భారతీయ వైద్యులు. అనితా డల్హౌసీ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం తోపాటు ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె యేల్ వంటి ఉన్నత విశ్యవిద్యాలయాల్లో న్యాయశాస్త్రం బోధించారు. ప్రజా జీవితంలోకి రాకముందే ఆమె ఆర్థిక నియంత్రణ, కార్పొరేట్ పాలనలో నిపుణురాలు. కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త జాన్‌ నోల్టన్‌ను అనిత్‌ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.

 

2019లో రాజకీయాల్లోకి..
57ఏళ్ల అనితా ఆనంద్ 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె ఒంటారియోలోని ఓక్ విల్లే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ట్రూడో క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రెండేళ్ల పాటు రక్షణ మంత్రిగానూ వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. కెనడియన్ సాయుధ దళాలలో సాంస్కృతిక మార్పు తీసుకురావడానికి చొరవ తీసుకున్నారు. 2023 మధ్యలో ఆమెను ట్రెజరీ బోర్డుకు మార్చినప్పటికీ.. సెప్టెంబర్ 2024లో రవాణా మరియు అంతర్గత వాణిజ్య మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

 

ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన స్థానంలో తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు పార్టీ నిమగ్నమైంది. ఆ సమయంలో ట్రూడో వారసురుడి స్థానంలో లిబరల్ పార్టీ నేతలు మార్క్ కార్నీతోపాటు భారత సంతతి ఎంపీ అనిత ఆనంద్ పేరుకూడా ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆ తరువాత తాను ప్రధాని పదవికి రేసులో లేనని ప్రకటించారు. ప్రస్తుతం కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్ బాధ్యతలు చేపట్టడం ద్వారా భారత్ , కెనడా దేశాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు బలోపేతం అవుతాయని అంతా భావిస్తున్నారు.