Israel Cyber War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ వార్.. 90 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ ధ్వంసం.. ప్రత్యర్థి ఆర్ధిక మూలాలపై దెబ్బ..
10 మిలియన్ యూజర్లు ఉన్న నోబిటెక్స్ డేటా హ్యాక్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ ప్లాట్ ఫామ్ సర్వీసులను నిలిపివేసింది.

Israel Cyber War: ఇరాన్ పై ముప్పేట దాడి చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు నుంచి అటాక్ మొదలు పెట్టింది. ఇరాన్ లోని అతి పెద్ద క్రిప్టో ఎక్స్ ఛేంజ్ నోబిటెక్స్ ని(Nobitex) హ్యాక్ చేసింది. ఏకంగా 90 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని నాశనం చేసింది. దీంతో భౌతిక దాడులతో పాటు ఆర్థికంగా కూడా ఇరాన్ ను కోలుకోలేని దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కదులుతున్నట్లుగా అర్థమవుతోంది.
ఇరాన్ పై బీభత్సమైన దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైబర్ వార్ కూడా ప్రారంభించింది. ఇరాన్ లోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ ఛేంజ్ నోబిటెక్స్ ని హ్యాక్ చేయడమే కాకుండా 90 మిలియన్ డాలర్లకు సమానమైన క్రిప్టో కరెన్సీని నాశనం చేసింది. అంతేకాదు అసలు ఈ ప్రోగ్రామ్ సోర్స్ కూడా బయట పెడతామంటూ ప్రకటించేసింది. ప్రిడేటర్ స్పారో అనే ఓ గ్రూప్ ఈ హ్యాకింగ్ తామే చేసినట్లు ప్రకటించగా, గత రెండు రోజుల్లో ఇది రెండో సైబర్ అటాక్.
క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్ లో ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ సెపా డేటాను కూడా హ్యాక్ అయ్యింది. దీంతో ఇరాన్ లోని చాలా చోట్ల ఏటీఎం సెంటర్ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ హ్యాకింగ్ కూడా తామే చేసినట్లు సేమ్ ప్రిడేటర్ స్పారో గ్రూప్ చెప్పుకుంటోంది. తాము చెప్పిన డిమాండ్లు ఒప్పుకోకపోతే నోబిటెక్స్ సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తామని ఈ గ్రూప్ బెదిరిస్తోంది. 10 మిలియన్ యూజర్లు ఉన్న నోబిటెక్స్ డేటా హ్యాక్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ ప్లాట్ ఫామ్ సర్వీసులను నిలిపివేసింది.
ప్రిడేటర్ స్పారో అనే ఈ హ్యాకింగ్ గ్రూప్ గొంజేష్కే దరాండే అనే ఐడీతో ఎక్స్ లో పోస్టులు చేస్తుండగా గత మూడేళ్లలో ఇరాన్ లో జరిగిన గ్యాస్ స్టేషన్ ప్రమాదాలకు, స్టీమ్ మిల్ యాక్సిడెంట్లకు గొంజేష్కే దరాండేనే కారణం అని చెబుతుంటారు. ఇజ్రాయెల్ అనుకూల కంటెంట్ ఇందులో పోస్ట్ చేస్తుంటారు. తాజా యుద్ధంలోనూ ఇజ్రాయెల్ ఈ గ్రూప్ వెనుకుండి ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీని వాడటమో, ట్రాన్సఫర్ చేయడమో కాకుండా నాశనం చేయడమే ఇందుకు నిదర్శనం.