Khaleda Zias funeral: బంగ్లాదేశ్‌కు వెళ్లిన జైశంకర్.. మోదీ లేఖను ‘డార్క్ ప్రిన్స్’కు అందజేత

జియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు.

Khaleda Zias funeral: బంగ్లాదేశ్‌కు వెళ్లిన జైశంకర్.. మోదీ లేఖను ‘డార్క్ ప్రిన్స్’కు అందజేత

Jaishankar, Tarique Rahman (X/@DrSJaishankar)

Updated On : December 31, 2025 / 2:53 PM IST
  • తారిక్ రెహ్మాన్‌తో జైశంకర్ భేటీ
  • ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరు
  • భారత్‌ తరఫున సంతాపం
  • జియా మృతిపై ప్రపంచ నాయకుల నివాళులు

Khaleda Zias funeral: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ఢాకాకు వెళ్లారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరై భారత తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ఢాకా చేరిన వెంటనే జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్‌ను జైశంకర్ కలిశారు. ఖాలేదా జియా పాలనాకాలంలో తారిక్ రెహ్మాన్‌ను ‘డార్క్ ప్రిన్స్’ అనేవారు.

ఎక్స్‌లో జైశంకర్ పోస్ట్ చేస్తూ… “ఢాకా చేరిన వెంటనే బీఎన్‌పీ తాత్కాలిక అధ్యక్షుడు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగమ్ ఖాలేదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌ను కలిశాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత లేఖను ఆయనకు అందజేశాను. భారత ప్రభుత్వం, భారత ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేశాను” అని తెలిపారు.

Also Read: బంగ్లా మాజీ ప్రధాని ఖలేదా జియా కన్నుమూత.. ఎవరీమె? ఈమె కొడుకు ‘డార్క్ ప్రిన్స్’ పునరాగమనం తర్వాత..

జియా అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు
ఖాలేదా జియా మంగళవారం దీర్ఘకాలిక అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ ఢాకాలోని జాతీయ పార్లమెంట్ సముదాయం బయట పెద్ద సంఖ్యలో ప్రజలు ఖాలేదా జియా అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొనేందుకు చేరుకున్నారు. ఢాకా ప్రాంతం, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఉదయం నుంచే పార్లమెంట్ భవనం సమీపంలోని మానిక్ మియా అవెన్యూ వైపు వెళ్లారు. బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో కప్పిన జియా పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి నివాసానికి, ఆపై ప్రార్థనా వేదికకు వాహనంలో తరలించారు.

జియా మృతిపై మోదీ సంతాపం
జియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా జియా ఆ దేశ అభివృద్ధి, భారత్-బంగ్లాదేశ్ సంబంధాల బలోపేతంలో చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ అన్నారు.