Mehul Choksi Arrested: బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్.. భారత్ కు అప్పగిస్తారా..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసి, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు ధ్రువీకరించాయి.

Mehul Choksi Arrested: బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్.. భారత్ కు అప్పగిస్తారా..?

Mehul Choksi Arrested

Updated On : April 14, 2025 / 11:22 AM IST

Mehul Choksi Arrested: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసి, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వర్గాలు సోమవారం ఉదయం ధృవీకరించాయి. 65ఏళ్ల చోక్సీని శనివారం అరెస్టు చేయగా ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే, భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకే బెల్జియం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

 

చోక్సీని అరెస్టు చేస్తున్న సమయంలో ముంబై కోర్టు జారీ చేసిన రెండు అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ మెహుల్ చోక్సీ బెయిల్ పై తక్షణమే విడుదలను కోరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ, అధికారులు ఛోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి.

 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను దాదాపు రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఛోక్సీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఛోక్సీ, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, ఛోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్ కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత నెలలో ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది.

 

బెల్జియం దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబర్ లో అతడు ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందినట్లు సమాచారం. ఇందుకోసం అతడు తప్పుడు పత్రాలను జత చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను క్యాన్సర్ చికిత్స కోసం ఆ దేశాన్ని విడిచిపెట్టి స్విట్జర్లాండ్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు.