Mumbai Blasts 2003: కెనడాలో ముంబై పేలుళ్ల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బషీర్ అరెస్ట్.. భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు
2002 సంవత్సరంలో ముంబై సెంట్రల్ స్టేషన్ పేలుడు, 2003 విలేపార్లే పేలుడు, 2003 మార్చి నెలలో ములుండ్ రైలు పేలుళ్లకు సంబంధించిన ఘటనల్లో బషీర్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.

Mumbai Blasts 2003
Terrorist CAM Basheer: ముంబై బాంబు పేలుళ్ల (2002-2003) కుట్రలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన చానెపరంబిల్ మహ్మద్ బషీర్‌ను కెనడా భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. కెనడా నుండి పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. హత్య, ఉగ్రవాద చర్యలు, కుట్ర, ఇతర ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇంటర్‌పోల్ జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్) ఆధారంగా అరెస్టు చేశారు. 2002 డిసెంబర్, 2003 మార్చి మధ్య ముంబయిలో జరిగిన టెర్రరిస్టు దాడుల్లో 12 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో సీఏఎం బషీర్ కీలక కుట్రదారుడు.
బషీర్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎస్ఐఎంఐ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)లో కీలక వ్యక్తి. 2002 సంవత్సరంలో ముంబై సెంట్రల్ స్టేషన్ పేలుడు, 2003 విలేపార్లే పేలుడు, 2003 మార్చి నెలలో ములుండ్ రైలు పేలుళ్లకు సంబంధించిన ఘటనల్లో బషీర్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరైన బషీర్‌ను ఇండియాకు రప్పించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం బషీర్ సోదరి రక్త నమూనాలను సేకరించేందుకు ముంబై పోలీసులు ఎర్నాకులంలో ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.
బషీర్ 1961లో కేరళలోని కప్రస్సేరి గ్రామంలో జన్మించాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. అలువా టౌన్‌లో సిమికి చెందిన ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. 1980 సంవత్సరం చివరిలో సిమికి అఖిల భారత అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు. చాలా మంది యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకు బషీర్ ప్రేరేపించాడు. అధికారుల వివరాల ప్రకారం.. బషీర్ ఇండియన్ ముజాహిదీన్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.
2002 – 03 సంవత్సరాల్లో ముంబై పేలుళ్ల తరువాత బషీర్ పలు ప్రాంతాల్లో పోలీసులు కళ్లుగప్పి జీవనం సాగించాడు. 2011 నుండి కెనడాలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. బషీర్ కు ఇప్పుడు 62 సంవత్సరాలు. అయితే బషీర్ ఇప్పటికీ నిఘా సంస్థల రాడార్‌లో ఉన్నాడు.