Nasa : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ.. నాసా కీలక నిర్ణయం.. 25 సంవత్సరాల చరిత్రలో తొలిసారి..
Nasa : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఓ వ్యోమగానికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక నిర్ణయం తీసుకుంది.
International Space Station
- ఐఎస్ఎస్‌లో వ్యోమగామికి అనారోగ్యం
- కీలక నిర్ణయం తీసుకున్న నాసా
- జనవరి 15న కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సన్నాహాలు
- ఐఎస్‌ఎస్ 25ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఓ వ్యోమగానికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యానికి గురైన వ్యోమగామిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నాసా షెడ్యూల్ ఖరారు చేసింది.
అసలేం జరిగింది..?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత ఏడాది ఆగస్టు నెలలో క్రూ-11 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 8వ తేదీన, 15వ తేదీన వోమగాములు స్పేస్‌వాక్ నిర్వహించేలా నాసా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే, జనవరి 8న నిర్వహించాల్సిన స్పేస్‌వాక్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే, రెండో షెడ్యూల్ అయిన 15వ తేదీన స్పేస్‌వాక్ నిర్వహించేలా నాసా ప్లాన్ చేయగా.. క్రూ-11 మిషన్‌లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది.
25 సంవత్సరాల చరిత్రలో తొలిసారి..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములను భూమిమీదకు తీసుకొచ్చేందుకు నాసా షెడ్యూల్ ఖరారు చేసింది. జనవరి 14న క్రూ-11 మిషన్ అన్ డాకింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 15న కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు నాసా వెల్లడించింది. నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, మైక్ ఫింకే , జాక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) వ్యోమగామి కిమియా యుయి, రోస్కోస్మోస్ వ్యోమగామి ఒలేగ్ ప్లాటోనోవ్‌లు భూమి మీదకు రానున్నారు. ఇదిలాఉంటే.. ఐఎస్ఎస్‌లో వ్యోమగామికి ఎలాంటి గాయం కాలేదని, ప్రస్తుతం వ్యోమగామి ఆరోగ్యం నిలకడగానే ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. షెడ్యూల్ సమయానికికంటే ముందుగానే ఒక మిషన్ (క్రూ-11)ను ముగించడం ఐఎస్ఎస్ 25ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
.@NASA and @SpaceX target undocking Crew-11 from the International Space Station no earlier than 5pm ET on Jan. 14, with splashdown off California targeted for early Jan. 15 depending on weather and recovery conditions. https://t.co/Y89iIj3jEY
— International Space Station (@Space_Station) January 10, 2026
