శ్రీలంకలో రక్తపాతం : 9వ బాంబు పేలుడు

శ్రీలంక భయం గుప్పట్లో ఉంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి. ఉగ్రవాదులు జరిపిన బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది. 11 చోట్ల బాంబులు పేలుతాయని ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఘోరకలి సంభవించింది. 8 చోట్ల బాంబులు పేలాయి. తాజాగా మరో బాంబు పేలింది. మొత్తంగా 9 చోట్ల బాంబులు పేలినట్లు అయ్యింది. ఇంకా 2 బాంబులు ఎక్కడ పేలుతాయోనని అధికారులు, ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మొత్తం 207 మంది మృత్యువాత పడగా..500 మందికిపైగానే గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.
ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ. పండుగను పురస్కరించుకుని అక్కడి వారు చర్చీల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కసారిగా బాంబులు పేలాయి. 6 గంటల వ్యవధిలో మొత్తం 8 బాంబులు పేలాయి. బట్టికలోవా, కోచికడే, సెయింట్ సెబాస్టియన్, చర్చిలు, సినామోన్ గ్రాండ్, షాంగ్రిల్లా, కింగ్స్ బరీ హోటల్స్‌లో పేలుళ్లు జరిగాయి. 2 చోట్ల ఆత్మాహుతి దాడులు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.