కరోనాను పూర్తిగా నియంత్రించకుండా, అన్‌లాక్ చేయడం విపత్తుకి దారి తీస్తుంది, WHO వార్నింగ్

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయింది. కాగా, ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని దేశాలు క్రమంగా అన్ లాక్ చేస్తున్నాయి. ఆంక్షలను సడలిస్తున్నాయి. మళ్లీ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ప్రపంచ దేశాలకు తాజాగా మరో హెచ్చరిక చేసింది. కరోనాను పూర్తిగా నియంత్రించకుండా అన్ లాక్ చేయడం ప్రమాదం అంది. కరోనాను కట్టడి చేయకుండా ఆర్థిక వ్యవస్థలను రీఓపెన్ చేయడం అంటే కోరి మరీ విపత్తుని కొని తెచ్చుకోవడమే అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
మహమ్మారి అంతమైనట్లు ఏ దేశమూ భావించొద్దు: WHO
కరోనా వైరస్ నేపథ్యంలో చాలా వరకు స్తంభించిన పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునర్ ప్రారంభాన్ని స్వాగతిస్తూనే.. ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారి వెళ్లిపోయినట్లు భావించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడి 8 నెలల అవుతుందని, ప్రజలు చాలా నీరసించి ఉంటారని తాము అర్థం చేసుకోగలమని, కానీ ఏ ఒక్క దేశంలో కూడా మహమ్మారి అంతం అయినట్లు భావించకూడదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ చెప్పారు. వైరస్ అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్నదని, ప్రాణాలను కాపాడడంలో, వైరస్‌ను నియంత్రించడంలో మనం అందరం సీరియస్‌గా ఉండాలన్నారు. పిల్లలు మళ్లీ స్కూల్ కి, జనాలు పనులకు, ఆఫీసులకు వెళ్లడం మేము చూడాలని అనుకుంటున్నాం. కానీ అదంతా కూడా చాలా సురక్షితంగా జరగాలి అని టెడ్రోస్ అన్నారు.
వైరస్ ను కట్టడి చేయకుండా ఆర్థిక వ్యవస్థలను ఓపెన్ చేయడం ప్రమాదకరం:
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సురక్షితమైన చర్యలు అమలు చేయాలని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్‌వో కోరింది. బహిరంగ కూడికలను నియంత్రించాలన్నది. ఎక్కువగా వైరస్ బారినపడే అవకాశం ఉన్న వారిని రక్షించే చర్యలు చేపట్టాలంది. వైరస్‌ను ప్రపంచ దేశాలు ఎంత నియంత్రిస్తే, ఆయా దేశాలు తమ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చని టెడ్రోస్ చెప్పారు. ఎటువంటి నియంత్రణ లేకుండా ఆర్థిక వ్యవస్థలను ఓపెన్ చేయడం ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. వైరస్ కాలం గడిచిపోయిందన్న భావనను ఏ దేశం కూడా చేయవద్దని సూచించారు.
అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాల్లో అత్యధిక కరోనా కేసులు:
ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజుకు 3 లక్షల మంది వరకు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాకాసి వైరస్ ను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్ని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మాయదారి రోగాన్ని నివారించేందుకు వ్యాక్సీన్ ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్, భారత్ ఈ మూడు దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2.5కోట్ల మందికి కరోనా పాజిటివ్ నమోదవగా.. వీటిలో 53శాతంపైగా ఈ మూడు దేశాల్లోనే వెలుగుచూస్తున్నాయి.
అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు:
అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటివరకు 59లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యధిక కేసులతో రెండో స్థానంలో కొనసాగుతున్న బ్రెజిల్‌లో 38 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇక, మన భారత్ కరోనా కేసుల నమోదులో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు భారత దేశ వ్యాప్తంగా 35 లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8లక్షల 47వేల 778మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.