Pakistan Army Chief: పాకిస్థాన్ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్..

ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ తన ఆర్మీ చీఫ్ కి ఇలాంటి ఉన్నతస్థాయి పదోన్నతి కల్పించడం హాట్ టాపిక్ గా మారింది.

Pakistan Army Chief: పాకిస్థాన్ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్..

Updated On : May 20, 2025 / 9:39 PM IST

Pakistan Army Chief: పాకిస్థాన్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌కు ప్రమోషన్ కట్టబెట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ గా ఉన్న మునీర్ కు ‘ఫీల్డ్ మార్షల్’ ర్యాంకును ఇచ్చింది. ఫీల్డ్ మార్షల్.. ఆ దేశంలోనే అత్యున్నత సైనిక హోదా.

పాక్ ప్రధాని షెషబాజ్ షరీఫ్ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల భారత్‌తో నెలకొన్న యుద్ధంలో మునీర్ నాయకత్వం, “ఆపరేషన్ బున్యాన్-ఉమ్-మర్సూస్” విజయం సాధించడం కారణాలుగా ఈ పదోన్నతి కల్పిస్తున్నట్టు క్యాబినెట్ పేర్కొంది. ఈ ప్రమోషన్ తో ఆసిం మునీర్ పాకిస్థాన్ సైనిక చరిత్రలో అత్యున్నత హోదాను అలంకరించిన కొద్దిమంది అధికారుల జాబితాలో స్థానం సంపాదించాడు.

ఫీల్డ్ మార్షల్ పాక్ సైన్యంలో అత్యున్నత ఐదు నక్షత్రాల హోదా. గతంలో 1959లో అయూబ్ ఖాన్‌కు మాత్రమే ఇవ్వబడింది. ఈ పదోన్నతి అందుకున్న రెండవ వ్యక్తి మునీర్ కావడం గమనార్హం. ఈ ర్యాంకుతో అదనపు అధికారాలు లేనప్పటికీ, సైనిక సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది.

Also Read: బెగ్గింగ్ మాఫియాలోనే కాదు క్రైమ్ లో కూడా.. ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో 23వేల మందికి పైగా పాకిస్థానీలు

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. సంబంధాలు కూడా అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ తన ఆర్మీ చీఫ్ కి ఇలాంటి ఉన్నతస్థాయి పదోన్నతి కల్పించడం హాట్ టాపిక్ గా మారింది.

పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగింది. సరిహద్దుల్లో పౌరులపై దాడులకు తెగబడింది. డ్రోన్లతో దాడికి ప్రయత్నం చేసింది. భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతిపాదనతో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ ఓకే చెప్పింది.