ఆస్పత్రిలో చేరిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. డిసెంబర్2 సోమవారం రాత్రి ఆయనకు అధిక రక్తపోటు, గుండెల్లో నొప్పి గా అనిపించటంతో దుబాయ్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. దుబాయ్ అమెరికన్ ఆస్పత్రిలో స్ట్రెచర్ పై ముషారఫ్ ను తీసుకు వెళుతున్న దృశ్యాలను పాక్ మీడియా ప్రసారం చేసింది.
ఇప్పటికే అమిలోడోసిస్ అనే వ్యాధితో ముషారఫ్ బాధ పడుతున్నారు. ఈవ్యాధి వల్ల ఆయన తనకాళ్లమీద తాను నిలబడలేక పోతున్నారు. రక్తపోటు పెరగటం..గుండెల్లో నొప్పిగా అనిపించటంతో డాక్టర్లు ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించారు. మరింత మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేరమని డాక్టర్లు సలహా ఇవ్వటంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశద్రోహం నేర కేసు ఎదుర్కొంటున్నందున ఆయన పాకిస్తాన్ రాలేక పోతున్నాడని ముషారఫ్ సన్నిహతుడు పిఎంఎల్ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ ముహమ్మద్ అమ్జాద్ చెప్పారు.
2007 లో పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ విధించినందుకు 2013లో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. 2016 నుంచి ముషారఫ్ దుబాయ లో నివసిస్తున్నారు. ఈకేసు వాయిదా డిసెంబర్ 5న ఉంది. కేసులో ముషారఫ్ ముద్దాయిగా తేలితే ముషారఫ్ కు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది.